వ్యూయర్‌షిప్‌లో న భూతో.. ! ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ ఫైనల్ రికార్డుల మోత

ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌ వ్యూయర్ షిప్ విషయంలో న భూతో న భవిష్యత్తు రికార్డులు నెలకొల్పింది. టీ20 చరిత్రలోనే అత్యధిక వ్యూయర్ షిప్ నమోదు చేసిన మ్యాచ్‌గా నిలిచింది. టీవీ, డిజిటల్ కలుపుకుని ఏకంగా (31.7బిలియన్) 3,170కోట్ల నిమిషాల వాచ్ టైం ఈ మ్యాచ్ సందర్భంగా నమోదైంది. టీవీల్లో (169 మిలియన్) 16 కోట్ల 90 లక్షల మంది చూడగా.. (15బిలియన్) 1,500 కోట్ల నిమిషాల వాచ్ టైం నమోదైంది. అలాగే జియో హాట్ స్టార్లో (892 మిలియన్) 89 కోట్ల 20 లక్షల మంది చూడగా.. (16.7బిలియన్) 1,674 కోట్ల నిమిషాల వాచ్ టైం నమోదైంది. ఇకపోతే ఐపీఎల్ 2025 సీజన్ టీవీ, డిజిటల్ వేదికలపై ఏకంగా 100 కోట్ల మంది చూడగా.. 84,000 కోట్ల నిమిషాల వాచ్ టైం నమోదైంది. ఈ సీజన్ అత్యధిక వ్యూయర్ షిప్ నమోదు చేయడంతో ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకున్న స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ ఖుషీ చేసుకున్నాయి. సీజన్‌కు ముందు జియో హాట్ స్టార్ అనుసంధానం కలిసొచ్చిందనే చెప్పాలి. అనేక రకాల రీఛార్జి ఆఫర్లలో భాగంగా సబ్ స్క్రిప్షన్ ఫ్రీగా లభించడం కారణంగా అభిమానులకు ఈ ఓటీటీ ప్లాట్ ఫాం మరింత దగ్గరైంది. అలాగే ఆర్సీబీ లాంటి ఫ్యాన్ బేస్ అధికంగా ఉన్న టీం ఈసారి అద్భుతంగా రాణించడం కూడా కలిసొచ్చి వ్యూయర్ షిప్ ఆకాశాన్నంటింది. 


ఇకపోతే ఐపీఎల్ 2025 ఫైనల్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 190 పరుగులు చేసింది. ఆ జట్టు స్టార్.. ఆర్సీబీ ముఖచిత్రమైన విరాట్ కోహ్లీ ( 35 బంతుల్లో 3 ఫోర్లతో 43) పర్వాలేదనిపించినా.. మిగతా వాళ్లు బెటర్ స్ట్రైక్ రేట్‌తో దూకుడుగా ఆడి 190 మార్క్ చేర్చారు. అయితే ఎలిమినేటర్ 2లో పంజాబ్ కింగ్స్ వీరోచిత ఛేజింగ్ వల్ల.. ఫైనల్లో కూడా ఆ జట్టు అలాగే చెలరేగితే ఆ లక్ష్యం ఉఫ్‌మనేది కానీ ఆర్సీబీ బౌలర్లు అద్భుతం చేశారు. ప్రమాదకర శ్రేయస్ అయ్యర్ తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో సగం మ్యాచ్ ఆ జట్టు చేతికి రాగా.. భువీ మ్యాచ్ స్వరూపాన్నే మార్చే కీలక ఓవర్ వేయడం, కృనాల్ పాండ్యా(2/17) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మ్యాచ్ గమనం ఆర్సీబీ వైపు ఉంచేలా చేయడం ప్లస్సయింది. కడవరకు శశాంక్ సింగ్ (29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61 నాటౌట్) క్రీజులో ఉన్న పంజాబ్‌ను మాత్రం 6పరుగుల దూరంలో ఆర్సీబీ బౌలర్లు అడ్డుకున్నారు. దీంతో 18ఏళ్ల అనంతరం తొలిసారి ఆర్సీబీ కప్పు ముద్దాడింది. కోహ్లీ ఆనందభాష్పపర్యంతం కాగా అశేష ఆర్సీబీ అభిమాన దళం సంబరాలు చేసుకుంది.    

Leave a Comment