ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్ట్ క్రికెట్లో 4 రోజుల టెస్ట్ మ్యాచ్‌లను నిర్వహించాలని యోచిస్తున్నట్లు ఇందుకు సంబంధించి ఇటీవల జరిగిన సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా 5 రోజుల పాటు రోజుకు సగటున 90 ఓవర్ల మేర టెస్ట్ మ్యాచ్ సాగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇక రోజుకు సగటున 90 నుంచి 95 ఓవర్ల మేర 4 రోజుల టెస్ట్ లను నిర్వహించడానికి ఐసీసీ కసరత్తు చేస్తోంది. ఇది కార్యరూపం దాల్చేందుకు టైం పట్టేలా ఉంది. ఈ నిర్ణయం పట్ల పలు దేశాల క్రికెట్ సంఘాలు మిశ్రమ స్పందనలు తెలియజేస్తున్నాయి. బీసీసీఐ వైఖరి ఏంటనేది ఇంకా తెలియలేదు. ఇంగ్లాండ్, ఆసీస్ నుంచి 4 రోజుల టెస్ట్ మ్యాచ్‌లు వద్దన్నట్లు సంకేతాలొస్తున్నాయి. కాగా చిన్న దేశాలు.. ఇతర బోర్డులు మాత్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025-27 WTC సైకిల్లో 4 రోజుల టెస్ట్ మ్యాచ్‌లు జరిగే వీలు లేదు. ఆ తర్వాతి సైకిల్లో మాత్రం పక్కాగా జరిగే ఛాన్సుంది.
అసలేందుకు 4 రోజులే..?
4 రోజుల టెస్ట్ మ్యాచ్‌లను నిర్వహించడానికి అనేక కారణాలున్నాయి. ఒకప్పుడు క్రీజులో పాతుకుపోయే బ్యాటర్లు.. 500, 600 భారీ స్కోర్లు.. డబుల్, త్రిబుల్ శతకాల జోర్లతో టెస్టులు సాగేవి.. కానీ నేటి తరపు టెస్టుల ఆటతీరే మారింది. ఇప్పుడంతా బాజ్ బాల్ జోరు సాగుతుంది. ఒకప్పుడు అయిదు రోజులైనా డిక్లేర్ల పర్వం సాగినా మ్యాచ్‌లు డ్రా అయ్యేవి. నేడు 3 లేదా 4 రోజుల్లో మ్యాచ్ ఫలితం తేలుతోంది. వర్షాలు పడ్డ సందర్భాల్లోనూ నిర్ణయాలొచ్చే పరిస్థితి. డ్రా కన్నా ఏదో ఓ టీం గెలిచేస్తుంది. 2024లో 52 టెస్ట్ మ్యాచ్‌లలో 49 మ్యాచ్‌లలో గెలుపోటముల ఫలితం వచ్చింది. సగటున మూడు రోజుల్లోనే (సుమారు 268 ఓవర్లలో) మ్యాచ్‌లు ముగిశాయి. కేవలం 3 మ్యాచ్‌లలో మాత్రమే ఫలితం తేలలేదు. దీంతో టెస్ట్ సరళి మారినట్లు స్పష్టమవుతుంది. బ్యాటింగ్లో వేగవంతమైన ఓవర్ రేట్, బౌలర్లలో సైతం వికెట్ టేకింగ్ కేపబిలిటీ పెరగడం లాంటివి టెస్టుల గమనాన్ని చాలా వరకు మార్చాయి. దీనివల్ల 5వ రోజు పెద్దగా ఆడాల్సిన పని లేకుండా పోతుంది. అందుకే 5 రోజుల స్థానంలో 4 రోజుల టెస్ట్ మ్యాచ్‌లు నిర్వహించాలని ఐసీసీ సన్నాహాలు చేస్తుంది. ప్రధాన బోర్డుల నుంచి సుముఖత వస్తే తప్పకుండా ఇది కార్యరూపం దాల్చే వీలుంది.
చిన్న దేశాలకు ఆర్థికంగా భారం
నాలుగు రోజుల టెస్టుల ద్వారా చిన్న, పెద్ద దేశాల షెడ్యూల్లో కొన్ని రోజులు కలిసొస్తాయి. ఫలితంగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడేందుకు వీలు కలుగుతుంది. ముఖ్యంగా చిన్నదేశాలకు 5 రోజులు నిర్వహించడం ఆర్థికంగా భారమవుతుంది. టెస్టులకు 5రోజుల పాటు వేసే వ్యయం వల్ల ఇబ్బందులు పడుతున్నాయి. టెస్టులు మూడు, నాలుగు రోజుల్లోనే ముగిసి పోతుండడం వల్ల అనవసర వ్యయమవుతుంది. నాలుగు రోజుల టెస్టులు నిర్వహించాలని ఇటీవల జరిగిన సమావేశాల్లో ఆయా దేశాల బోర్డులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.