1st Test england vs India : టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా తొలి టెస్ట్ లీడ్స్‌లోని హెడ్డింగ్‌లీ స్టేడియంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో యువ టీమిండియా బ్యాటింగ్లో ఎందుకింత హరీబరీ అవుతుందో అర్థం కావడం లేదు. రెండో ఇన్నింగ్సులో భాగంగా నాలుగో రోజు.. రెండు సెషన్ల పాటు పూర్తి ఆధిపత్యం వహించిన టీమిండియా.. మూడో సెషన్లో ఉన్నపళంగా 31 పరుగుల వ్యవధిలో ఏకంగా 6 వికెట్లు కోల్పోయి 364 పరుగులకు ఆలౌట్ అయింది. ఒకానొక దశలో 332 పరుగులకు 4 వికెట్లు మాత్రమే కోల్పోయి పటిష్ఠ స్థితిలో ఉన్న టీమిండియా ఈజీగా 400 దాటేస్తుందనుకుంటే 364కే కుప్పకూలింది. దీంతో 371 పరుగుల లీడ్ మాత్రమే దక్కింది. ఇంగ్లాండ్ లాంటి జట్టు ఒక్క రోజు పూర్తిగా ఆడితే ఇదంతా పెద్ద ఛేదనేం కాదు. టీమిండియా తన హరీబరీ బ్యాటింగ్‌తో మ్యాచ్ విజయవకాశాలను దాదాపు చేజార్చుకుంది.
సేమ్ టూ సేమ్ కొలాప్స్
ఇకపోతే తొలి రోజు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 359 పరుగులు చేసిన టీమిండియా.. రెండో రోజు 471 పరుగులకే ఆలౌట్ అయింది. అప్పుడు కేవలం 41 పరుగులకే 7 వికెట్లు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. సేమ్ అలాగే రెండో ఇన్నింగ్సులోనూ కుప్పకూలింది. దీంతో మ్యాచ్ ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలోకి వెళ్లింది. ఇంగ్లాండ్ ఫోర్త్ ఇన్నింగ్స్‌లో ఛేదనకు పెట్టింది పేరు. ఈ స్టేడియంలో ఫోర్త్ ఇన్నింగ్స్‌లో చాలా సార్లు ఆ జట్టు విజయాలు సాధించింది. 2019, 2023లో ఆస్ట్రేలియాపై, 2022లో న్యూజిలాండ్‌పై అనూహ్య విజయాలు ఫోర్త్ ఇన్నింగ్స్‌లో ఛేదించి సాధించింది.

image credit : X
రెండు సెషన్ల పాటు ఆధిపత్యం
మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా రెండో ఇన్నింగ్సులో 2 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. ఇక నాలుగో రోజు బరిలోకి దిగిన ఇండియాకు గట్టి దెబ్బ తాకింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ( 8 ) వెంటనే ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ క్రమంలో వీరిద్దరు తమ సెంచరీలను కూడా పూర్తి చేసుకున్నారు. వీరు రెండు సెషన్ల పాటు ఇంగ్లాండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం వహించారు.
రిషబ్ పంత్ ఎందుకలా ఆడుతున్నాడో..
ఈ క్రమంలో రిషబ్ పంత్ సెంచరీ తర్వాత స్కోరు వేగం పెంచేందుకు హార్డ్ హిట్టింగ్ మొదలెట్టాడు. అతను తన వికెట్ ఇంపార్టెన్స్ ఏమాత్రం అర్థం చేసుకోకుండా ఎందుకలా ఆడుతున్నాడో అర్థం కావడం లేదు. కావాలనే ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ అతన్ని టెంప్ట్ చేసేందుకు స్పిన్నర్ బషీర్‌ను వేయిస్తున్నాడని తెలిసి కూడా బంతిని గాల్లోకి హిట్ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో క్యాచ్ ఔటయ్యాడు. నిజానికి పంత్ తన ఇన్నింగ్స్ ( 118 పరుగులు 140 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు ) మరింత పకడ్బందీగా ఆడి.. స్కోరును ఇంకాస్త పెంచాల్సింది. ఎందుకంటే టెస్టుల్లో కుదురుకున్న ప్లేయర్లే మంచి ఇన్నింగ్స్ నిర్మించగలరు. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా సెంచరీ తర్వాత ఇక చాలు అన్నట్లు అతని వాలకం ఉంటోంది.
ఒకే ఓవర్లో 3 వికెట్లు
ఇక ఆ తర్వాత కేఎల్ రాహుల్ (137పరుగులు 247బంతుల్లో 18ఫోర్లు) కాస్తా నిలకడ చూపించినా.. అతను బైడన్ కార్స్ బౌలింగ్లో కట్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ సీన్ రిపీట్ అయింది. తర్వాత వచ్చిన వాళ్లు అలా వచ్చి ఇలా వెళ్లారు. కరుణ్ నాయర్ ( 20 ), రవీంద్ర జడేజా (25), శార్దూల్ ఠాకూర్ ( 4 ), బుమ్రా, సిరాజ్, ప్రసిద్ద్ డకౌట్లుగా వెనుదిరిగారు. జోష్ టంగ్ వేసిన 90 వ ఓవర్లో టీమిండియా 3 వికెట్లు పోగొట్టుకోవడంతో ఇన్నింగ్స్ చాలా త్వరగా ముగిసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బైడన్ కార్స్ 3, టంగ్ 3, బషీర్ 2 వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్, స్టోక్స్ తలా ఓ వికెట్ తీశారు. ఈజీగా 400 స్కోరు దాటుతుందనుకుంటే 364 పరుగులకే టీమిండియా చాపచుట్టేయడం గమనార్హం.

image credit : X
ఎర్లీగా వికెట్లు తీయకుంటే
ఇక అనంతరం ఫోర్త్ ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 21 పరుగులు చేసి సమయోచితంగా ఆడారు. క్రీజులో జాక్ క్రాలీ (12), డకెట్ (9) ఉన్నారు. చివరి రోజు ఇంగ్లాండ్ విజయానికి 350 పరుగులు కావాలి. ఆ జట్టుకు ఇలాంటి ఛేదన కొత్తదేమీ కాదు.. కాబట్టి ఈ మ్యాచ్‌లో అయిదో రోజు ఎర్లీగా వికెట్లు తీయకుంటే.. ఇంగ్లాండ్ బ్యాటర్లు తప్పకుండా విజయం కోసమే చూస్తారు. డ్రా కోసం వాళ్లు ఆడేరకం కాదని అందరికీ తెలిసిందే. రేపు బుమ్రా మీదే ఇండియా ఆశలన్నీ ఉన్నాయి.
ఆ క్యాచ్‌లు గనుక పట్టుంటే..
మూడో రోజు TeamIndia ఫీల్డింగ్‌లో చేసిన కొన్ని మిస్టేక్స్ కాస్ట్‌లీగా మారాయి.. యశస్వి జైస్వాల్ మూడు క్యాచ్‌లు, జడేజా ఒక క్యాచ్ నేలపాలు చేశారు. ఆ క్యాచ్ డ్రాప్‌ల ఫలితంగా ఓలీపోప్, డకెట్, హ్యారీ బ్రూక్ చెలరేగారు. క్యాచ్ డ్రాప్‌ల అనంతరం వీరు ముగ్గురు కలిపి చేసిన పరుగులు 144 పరుగులు. ఈ క్యాచ్‌లు గనుక పట్టుంటే ఇండియాకు 500కి మించి లీడ్ దొరికేది. ఫలితంగా విజయం మనవైపే ఉండేది. క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు.. క్యాచెస్ డ్రాప్స్ లూసెస్ అంటారు.. ఈ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడంలో క్యాచ్ డ్రాప్‌లు కూడా కీలకం కానుంది.

image credti : X
సెంచరీలు చాలా.. ఆ తర్వాత దూకుడా
సాధారణంగా టెస్టుల్లో నిలదొక్కుకున్న బ్యాటర్లే తమ సెంచరీలను డబుల్ సెంచరీలుగా మార్చుతూ ఇన్నింగ్స్ నడిపిస్తుంటారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో తొలి ఇన్నింగ్సులో స్కోరు వేగం పెంచడానికి నిలదొక్కుకున్న బ్యాటర్లు వికెట్ చేజార్చుకోరాదు. కానీ ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో నిలదొక్కుకున్న పంత్, శుభ్‌మన్ గిల్ సెంచరీ తర్వాత దూకుడుగా ఆడి వికెట్ చేజార్చుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో పంత్ సైతం సెంచరీ తర్వాత పూర్తి హిట్టింగ్‌కు దిగి వికెట్ కోల్పోయాడు. సెంచరీల తర్వాత దూకుడు టెస్టుల్లో పనికిరాదని టీమిండియా బ్యాటర్లు తెలుసుకోవాల్సిన అవసరముంది.
1st Test england vs India Playing 11 :
ఇండియా : యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ
ఇంగ్లాండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలి పోప్, జోరూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్