gambhir About pakistan vs India matches : పాక్‌తో అసలే వద్దు.. మన వాళ్ల ప్రాణాలే ముఖ్యం

gambhir About pakistan vs India matches: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాలను పూర్తిగా ఆపేయాలని భారత క్రికెట్ జట్టు  కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. “నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. ఈ ఉగ్రవాదం పూర్తిగా ఆగే వరకు, భారత్, పాకిస్తాన్ మధ్య ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు జరగొద్దు.” అని తేల్చి చెప్పారు.

ఇకపోతే ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26మంది భారత పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడికి పాకిస్తాన్‌కు సంబంధాలు ఉన్నాయని భారత్ ప్రధాన ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అట్టారీ సరిహద్దును మూసివేసింది. దౌత్య సంబంధాలను తగ్గించేసింది. పాక్ దేశీయులను ఇండియా వీడాలని హెచ్చరికలు కూడా జారీ చేసింది. పహల్గం దాడి నేపథ్యంలో మళ్లీ పాక్ వర్సెస్ భారత్ మధ్య క్రికెట్ గురించి చర్చలు తీవ్రమయ్యాయి. 2013 జనవరి నుండి భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు జరగలేదు. ఆసియా కప్, ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. దుబాయ్‌లో జరిగిన 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో చివరిసారిగా ఇరు జట్లు పోటీ పడ్డాయి. ఈ సంవత్సరం జరిగే మహిళల వన్డే ప్రపంచ కప్, మెన్స్  ఆసియా కప్, 2026 మెన్స్ టీ20 ప్రపంచ కప్‌లో కూడా ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో గంభీర్ ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లు జరగకూడదని అభిప్రాయపడడం ప్రాధాన్యం సంతరించుకుంది.

“మనం వారితో ఆడాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. భారత సైనికుల, భారత పౌరుల ప్రాణాల కంటే ఏ క్రికెట్ మ్యాచ్ లేదా బాలీవుడ్ లేదా మరే ఇతర సంబంధాలు పాక్‌తో నెరపడం ముఖ్యమైనది కాదు. మ్యాచ్‌లు జరుగుతూనే ఉంటాయి.. సినిమాలు తీస్తూనే ఉంటారు.. సింగర్స్ ప్రదర్శనలు చేస్తూనే ఉంటారు, కానీ మన కుటుంబంలో ఒక ప్రియమైన వ్యక్తిని కోల్పోకుండా ఉండడం అన్నింటికంటే ముఖ్యం. ” అని గంభీర్ చాటాడు.

కోచింగ్ పాత్రపై గంభీర్ స్పష్టత

ఇక రాబోయే ఇంగ్లాండ్ పర్యటనలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఎంపిక చేసే విషయంలో తనకు ఎలాంటి పాత్ర ఉండదని గంభీర్ స్పష్టం చేశారు. డిసెంబర్-జనవరిలో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇద్దరు బ్యాటర్లు సరిగా రాణించలేదు. అయితే ఈ సంవత్సరం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలవడంలో ఇద్దరు ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో వీరి సెలెక్షన్ గురించి మాట్లాడుతూ.. “కోచ్ పని జట్టును ఎంపిక చేయడం కాదు. అది సెలెక్టర్ల పని. మ్యాచ్‌ టైంలో ఆడే 11 మందిని మాత్రమే ఎంపిక చేయడంలో కోచ్ పాత్ర ఉంటుంది. నా ముందు కోచ్‌గా చేసిన వారు సెలెక్టర్లు కాదు, నేను కూడా సెలెక్టర్ని కాదు.” అని పేర్కొన్నాడు.

అది వారి వ్యక్తిగత నిర్ణయం

“ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేస్తున్నంత కాలం.. జట్టులో ఉండాలి. రిటైర్మెంట్ ఎప్పుడు అనేది వారి వ్యక్తిగత నిర్ణయం. ఏ కోచ్, ఏ సెలెక్టర్, ఆఖరుకు బీసీసీఐ కూడా ఎప్పుడు రిటైర్ అవ్వాలో చెప్పదు. ప్రదర్శన బాగుంటే 40, 45 ఏళ్ల వరకైన హాయిగా ఆడవచ్చు. ఇక్కడ ఆపేవాళ్లు ఎవరు” అని గంభీర్ అన్నారు. తాజాగా పాక్‌తో క్రికెట్, రిటైర్మెంట్ రిలేటెడ్ చేసిన గంభీర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కొందరు అతనికి మద్దతు పలికితే మరికొందరు.. ఇంకొరకంగా స్పందిస్తున్నారు.

Leave a Comment