IPL 2025 MI Vs GT : ఇవేం డ్రామాలు వరుణా..? చివరికి గుజరాత్‌దే గెలుపు

IPL 2025 MI Vs GT : వాంఖడే స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా ముగిసింది. వర్షం అనేకసార్లు అంతరాయం కలిగించడంతో పాటు విజయం ఇరుజట్ల మధ్య దోబూచులాడుతూ.. కడకు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ చివరి బంతికి డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్ (DLS) పద్ధతి ప్రకారం గెలుపొందింది. చివరి ఓవర్లో 15 పరుగులు కావాల్సిన తరుణంలో దీపక్ చాహర్ బౌలింగ్‌కు దిగడం.. ఆ ఓవర్లో ఓ నోబాల్ వేయడం, చివరి బంతికి రనౌట్ మిస్సవ్వడం ఇలా అనేకానేక బ్యాడ్ లక్‌లు ముంబైని ముంచేశాయి. దీంతో గుజరాత్ గెలుపొంది ముంబై జైత్రయాత్రకు అడ్డుకట్ట వేసింది. ఈ మ్యాచ్ అనంతరం గుజరాత్ పాయింట్ల పట్టికలో 16పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని ఖాయం చేసుకోగా.. ముంబై 14 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకుంది.

ముంబై మిడిలార్డర్ వైఫల్యం

ఇకపోతే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్  ఓపెనర్లు రోహిత్ శర్మ (7), ర్యాన్ రికిల్టన్ (2) త్వరగా వికెట్లు సమర్పించుకున్నారు. ఆ తర్వాత విల్ జాక్స్ అద్భుతమైన అర్ధ సెంచరీతో (53 పరుగులు, 35 బంతులు, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. ఆరెంజ్ క్యాప్ సురీడు.. సూర్యకుమార్ యాదవ్ (35 పరుగులు, 24 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్సర్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. ఒకానొక దశలో ముంబై 180 ఈజీగా చేస్తుందనిపించింది. అయితే 97పరుగుల వద్ద 2వికెట్లు కోల్పోయి పటిష్ఠ స్థితిలో ఉన్న ముంబై మిడిలార్డర్ తేలిపోవడంతో 123పరుగులకే 7వికెట్లు పడిపోయి ఇన్నింగ్స్ పతనాన్ని చవిచూసింది. చివర్లో కోర్బిన్ బాష్ (27 పరుగులు, 22 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కొద్దిగా ప్రతిఘటించడంతో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేయగలిగింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సాయి కిషోర్ (2/34) రెండు వికెట్లు తీయగా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, గెరాల్డ్ కోయెట్జీ ఒక్కో వికెట్ పడగొట్టారు.

 వరుణుడు ఆడుకున్నాడు..

156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌ను ముంబై బౌలర్ల కంటే వరుణుడే ఎక్కువగా ఆడుకున్నాడు. ఎలాగోలా చివరికి వరుణుడు కరుణించి జీటీకి గెలుపు అందించాడు. ఇకపోతే జీటీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న సాయి సుదర్శన్ (5) త్వరగా ఔటయ్యాడు. శుభ్‌మన్ గిల్ (43 పరుగులు, 46 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్సర్) టెస్ట్ తలపించగా.. జోస్ బట్లర్ (30 పరుగులు, 27 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్సర్) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్న క్రమంలో చేయలేకపోయాడు. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (28 పరుగులు, 15 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) నెమ్మదిగా సాగుతున్న స్కోరుబోర్డును కాస్త వేగవంతం చేశాడు. అప్పటివరకు డీఎల్ ఎస్ పద్ధతి ప్రకారం.. విజయానికి వెనకబడి ఉన్న గుజరాత్ ఇతని ఇన్నింగ్స్‌తో ముందంజలోకి వచ్చింది.  ఇతను ఔటయ్యాక.. రౌండ్ రౌండ్‌కు ఓటింగ్లో ఆధిక్యాలు మారినట్లు డీఎల్ఎస్ మెథడ్ ప్రకారం.. గెలుపు ముంబై, గుజరాత్ మధ్య దోబూచులాడింది. వర్షం కారణంగా.. ఇక మ్యాచ్ జరగదనకున్న టైంలో ఒక్క ఓవర్లో 15 పరుగులు చేస్తే గెలిచే సమీకరణంతో చివరి నిమిషంలో ఆట మొదలైంది. అయితే ఆట ఆగిపోతే మాత్రం.. 4పరుగుల తేడాతో ముంబై గెలిచేది. కానీ వరుణుడు లాస్ట్ మినిట్లో కరుణించడంతో ఆట మళ్లీ మొదలైంది. అంతకుముందు కూడా వర్షం కారణంగా జీటీ ఇన్నింగ్స్‌కు అంతరాయం కలిగింది. చివరి ఓవర్‌లో గుజరాత్ విజయానికి 6 బంతుల్లో 15 పరుగులు అవసరం కాగా.. క్రీజులో రాహుల్ తెవాటియా (11*), గెరాల్డ్ కోయెట్జీ (12) జట్టును గెలిపించగలిగారు. కోయెట్జీ సిక్స్ కొట్టి మ్యాచ్ జీటీ వైపు తిప్పాడు. దీపక్ చాహర్ నోబాల్ వేసి.. ఇంకాస్త జీటీకి ఈజీ చేశాడు. చివరి బౌలింగ్ ఎండ్ లో తొందరగా త్రో అందుకోక మ్యాచ్ జీటీకి సమర్పయామి చేశాడనిపించేలా చేశాడు. లాస్ట్ బంతికి 1రన్ అవసరం కావాల్సిన తరుణంలో ఈజీ రనౌట్ ను ముంబై మిస్ చేసుకోవడంతో గుజరాత్ గెలుపొంది సంబరాలు చేసుకుంది.

బుమ్రా దమ్మున్న స్పెల్

జస్‌ప్రీత్ బుమ్రా తన నాలుగు ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కీలకమైన రెండు వికెట్లు తీశాడు. శుభ్‌మన్ గిల్, షారుఖ్ ఖాన్ లను ఔట్ చేసి అప్పటివరకు జీటీ వైపు సాగుతున్న మ్యాచ్‌ను ముంబై వైపు మార్చేశాడు. అతను పొదుపుగా బౌలింగ్ చేశాడు అలాగే మ్యాచ్ మలుపు తిప్పాడు.. కానీ వర్షం అంతరాయం కలిగించడంతో పాటు దీపక్ చాహర్, హార్దిక్ పాండ్యా బౌలింగ్ వైఫల్యాల వల్ల అతని ప్రయత్నం వృథా అయింది.

Leave a Comment