వన్ వీక్ తర్వాత.. బీసీసీఐ క్లారిటీగా చెప్పిందేంటంటే?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్ 2025 వాయిదా పై అధికారికంగా స్పందించింది. ఫ్రాంచైజీల నుంచి వచ్చిన అభ్యర్థనలు, ఆటగాళ్లలో నెలకొన్న ఆందోళనల దృష్ట్యా ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు కాసేపటిక్రితమే బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్ని రోజులు వాయిదా వేస్తుందో చెప్పలేదు. తాజాగా మరో ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన మేరకు టోర్నీని తక్షణమే వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆటగాళ్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బోర్డు తెలిపింది. దేశంలో నెలకొన్న పరిస్థితులు చక్కబడిన తర్వాత టోర్నీని తిరిగి ప్రారంభించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.

సాయుధ బలగాలకు సెల్యూట్

భారత సాయుధ బలగాలకు బీసీసీఐ సంపూర్ణ మద్దతు తెలుపుతోంది. వారి ధైర్య సాహసాలకు బోర్డు సెల్యూట్ చేస్తోంది. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ‘ఎక్స్’ వేదికగా వరుస ట్వీట్లు చేసింది. “ఈ క్లిష్ట సమయంలో దేశానికి బీసీసీఐ అండగా నిలుస్తుంది. భారత ప్రభుత్వంతో పాటు సాయుధ దళాలు దేశ ప్రజలకు మా సంఘీభావం తెలియజేస్తున్నాం. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత సాయుధ దళాల ధైర్య సాహసాలు నిస్వార్థ సేవకు బీసీసీఐ సెల్యూట్ చేస్తోంది. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దళాలు జరిపిన దాడులు పాకిస్థాన్ సాయుధ దళాల దుస్సాహసాన్ని తిప్పికొట్టిన తీరును బీసీసీఐ కొనియాడుతోంది. భారత సైన్యం తమ చర్యలతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది” అని కౌన్సిల్ తన ట్వీట్లలో పేర్కొంది.

కొత్త షెడ్యూల్‌పై ప్రకటన

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ విషయంపై ఒక ప్రకటన విడుదల చేశారు. సంబంధిత అధికారులు వాటాదారులతో చర్చించి దేశంలో నెలకొన్న పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన తర్వాత మిగిలిన మ్యాచ్‌ల కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. క్రికెట్ నేషనల్ ప్యాషన్ అయినప్పటికీ దేశ భద్రత కంటే ఏదీ ఎక్కువ కాదని ప్రకటనలో స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కంటే బీసీసీఐకి ఏదీ ఎక్కువ కాదని ఆయన తేల్చి చెప్పారు.

ఐపీఎల్ 2025 రద్దు

స్పాన్సర్లకు, బ్రాడ్ కాస్టర్లకు ధన్యవాదాలు

ఈ క్లిష్ట సమయంలో తమకు అండగా నిలిచిన ఐపీఎల్ అధికారిక బ్రాడ్ కాస్టర్ జియో హాట్ స్టార్, టైటిల్ స్పాన్సర్ టాటా అసోసియేట్ భాగస్వాములకు దేవజిత్ సైకియా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారం రోజుల తర్వాత భారత్ పాకిస్థాన్ మధ్య పరిస్థితులు సద్దుమణిగితే ఐపీఎల్ 2025 సీజన్ తిరిగి ప్రారంభం కానుంది. అప్పటివరకు అభిమానులు సహకరించాలని బీసీసీఐ కోరింది. దేశంలో శాంతి నెలకొనాలని టోర్నీ మళ్లీ ప్రారంభం కావాలని యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తోంది.

Leave a Comment