Jiteshs brilliance RCB in the top 2
jitesh sharma: లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ (rcb) మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచులో ఆర్సీబీ లక్నో పై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగడంతో 227 పరుగుల భారీ స్కోరు చేసింది. రిషబ్ పంత్ ఎట్టకేలకు తన సత్తా చాటుతూ ఐపీఎల్ లో రెండో సెంచరీ సాధించాడు. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచుల్లో కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేసిన రిషబ్ చివరి మ్యాచులో 61 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సులతో 118 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ 37 బంతుల్లో నాలుగు ఫోర్లు, అయిదు సిక్సులతో 67 పరుగులు చేయగా లక్నో మొదటి ఇన్సింగ్స్ ను 227 పరుగులతో ముగించింది.
విరాట్ కొహ్లీ అవుట్ కాగానే..
అనంతరం బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫిల్ సాల్ట్, విరాట్ కొహ్లీ (virat kohli) ఇద్దరు వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. భారీ లక్ష్యం ఎదుట ఉన్నా.. ఏ మాత్రం ప్రత్యర్థికి చాన్స్ ఇవ్వకుండా ఎడాపెడా బౌండరీలు, సిక్సులతో స్కోరు పెంచుతూ పోయారు. 121/4 పరుగుల టీం స్కోరు వద్ద విరాట్ కొహ్లీ (50) అవుట్ కావడంతో ఆర్సీబీ గెలవదేమో చివరకు మళ్లీ ముంబయితో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి వస్తుందేమో అనుకున్నారు.
jitesh sharma: జితేశ్ సుడిగాలి ఇన్సింగ్స్
ఈ మ్యాచులో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న జితేశ్ శర్మ ( jitesh sharma ) సుడిగాలి ఇన్సింగ్స్ తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కేవలం 33 బంతుల్లోనే 85 పరుగులు చేసి ఆర్సీబీని టేబుల్ టాప్ 2లో నిలిపాడు. జితేశ్ 6 సిక్సులు, ఎనిమిది ఫోర్లలో చెలరేగి ఆర్సీబీకి మరుపురాని విజయాన్ని అందించాడు. దీంతో ఆర్సీబీ 2016 తర్వాత క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడనుంది. ఇందులో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. 18 సీజన్లలో ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలవని ఆర్సీబీ మూడు సార్లు ఫైనల్ లో ఓడిపోయింది. ఈసారి ఫైనల్ కు వెళితే నాలుగో సారి ఆర్సీబీ ఫైనల్ చేరుకున్నట్లు అవుతుంది
విరాట్ కు కానుకగా ఇవ్వాలని
విరాట్ కొహ్లీ 18 సీజన్ల నుంచి ఆర్సీబీకే ఆడుతున్నాడు. దిగ్గజ క్రికెటర్ అయినా విరాట్ కు ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. టీం ఇండియాకు ఆడుతున్న చాలా మంది క్రికెటర్లు ఇప్పటికే ఐపీఎల్ కప్ గెలుచుకున్న టీంలలో ఉన్నారు. రోహిత్ శర్మ (rohith sharma) ఏకంగా 5 సార్లు ముంబయి ఇండియన్స్ తరఫున, ఒకసారి దక్కన్ చార్జర్స్ తరఫున విన్నర్ టీంలో ఉన్నాడు. కానీ విరాట్ కు ఇది ఊరిస్తూనే ఉంది. కాబట్టి ఎలాగైనా సరే విరాట్ కొహ్లీకి ఐపీఎల్ టైటిల్ ఇచ్చి సత్కరించాలని ఆర్సీబీ టీం సభ్యులు గట్టిగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.