South Africa dream: దశాబ్ధాల కల నెరవేరితే ఎలా ఉంటుందో తెలుసా..? గెలుపు తలుపులు తెరుచుకోవడానికి 27 ఏళ్ల నిరీక్షణ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఎంత బాగా ఆడినా ఆవగింజంతా అదృష్టం లేకపోతే చేసినా శ్రమ అంతా వృథా అయితే కన్నీళ్లు తప్ప విజయానికి మీరు అర్హులు కారని తెలిస్తే.. లోకమంతా ఇక వీళ్లతో కాదేమో అని విమర్శిస్తుంటే.. ఒకటా.. రెండా.. 27 ఏళ్ల సుదీర్ఘ విరామానికి, ఓటమికే విసుగుపుట్టి ఇక చాలు అనుకుందేమో అనేలా ఒక విజయం వస్తే ఎలా ఉంటుందో సౌతాఫ్రికా క్రికెట్ టీంను అడిగితే తెలుస్తుంది. ఆ దేశ క్రికెట్ అభిమానులను అడిగితే అర్థమవుతుంది.
ఓడిపోయి అలసిపోయి గెలిస్తే..
ఓడిపోవడం సాధారణం. క్రీడల్లో అయినా, నిజ జీవితంలో అయినా ఓటమి అనేది ప్రతిఒక్క వ్యక్తికి వ్యవస్థలో సహజం. కానీ ఆ ఓటములు సాదాసీదావి అయితే పర్లేదు. చేతిదాకా అందవచ్చినట్లే వచ్చి.. నోటి కాడి ముద్దను లాగేసుకువెళుతుంటే ఆ బాధ వర్ణనాతీతం. కానీ ఆ ఒక్క మధురమైన గెలుపు. మరుపురాని గెలుపు సౌతాఫ్రికా క్రికెట్ కు సొంతమైంది. క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్ లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (World Test Championship) టైటిల్ ను సగర్వంగా అందుకుంది. మొదటి రెండు రోజుల ఆటలో వీళ్లేం గెలుస్తారులే అనుకున్న అందరి నోటే శభాష్ అనిపించుకుంటూ టెస్ట్ గదను సొంతం చేసుకుని చిరకాల వాంచను నెరవేర్చుకుంది.

South Africa dream: దిగ్గజాలతో కానిది టెంబ బవుమా సాధించగా
గ్యారీ కిర్ స్టన్, హెర్షల్ గిబ్స్, గ్రేమ్ స్మిత్ , జాక్వస్ కలిస్, అండ్రూ నెల్, షాన్ పొలాక్, మకయా ఎన్తినీ, జేపీ డుమిని, ఏబీ డివిలియర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది హేమహేమీలకు సాధ్యం కాని ఐసీసీ టైటిల్ ను టెంబ బవుమా సారథ్యంలోని టీం ఒడిసిపట్టుకుంది. గెలుపు మజాను మొదటిసారి చూసిన సౌతాఫ్రికా ప్లేయర్ల కళ్లలో ఆనంద బాష్పాలు.. స్టేడియంలో కూర్చున్న వేలాది మంది ఆఫ్రికా ప్రజల్లో కన్నీటి సంద్రం అయింది. బౌలింగ్ లో రబాద, బ్యాటింగ్ లో అడెన్ మర్ క్రమ్, టెంబ బవుమా (Temba Bavuma) పోరాటంతో రెండు రోజులు మ్యాచులో వెనకబడి అద్వితీయంగా పుంజుకుని ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ (World Test Championship)ను గెలుచుకుని సగర్వంగా నిలబడింది సౌతాఫ్రికా టీం. ఇంతకంటే గొప్ప రోజు సౌతాఫ్రికాకు మరోకటి ఉండదేమో అని అనుకునేలా సంబరాలు చేసుకుంటున్నారు.

సమర్థంగా అడ్డుకున్న సౌతాఫ్రికా బ్యాటర్లు
ఈ మ్యాచులో ఆస్ట్రేలియా మొదటి ఇన్సింగ్స్ లో 212 పరుగులకు ఆలౌట్ కాగా.. దక్షిణాఫ్రికా కేవలం 138 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్సింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాటర్లు 70 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినా వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ అలెక్స్ క్యారీ, ఆల్ రౌండర్ మిచెల్ స్టార్క్ 58 పరుగులతో రాణించగా రెండో ఇన్సింగ్స్ ను ఆస్ట్రేలియా 207 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా మొదటి ఇన్సింగ్స్ లో వచ్చిన లీడ్ తో కలుపుకుని సౌతాఫ్రికా ఎదుట 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఈ లక్ష్యం ఛేదించడం అసాధ్యమనే అందరూ అనుకున్నారు. ఇప్పటి వరకు లార్డ్స్ లో ఇన్ని పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది కేవలం రెండు సార్లు మాత్రమే కావడంతో సౌతాఫ్రికా గెలవదని అందరూ అనుకున్నారు. కానీ ఆసీస్ బౌలర్లను సమర్థంగా అడ్డుకున్న మార్ క్రమ్, (Aden Marcum), టెంబ బవుమా సెంచరీ, హాస్ సెంచరీలతో కదం తొక్కి సౌతాఫ్రికాకు ఐసీసీ టైటిల్ ను అందించారు.
