Why Sachin Named as Master: సచిన్ టెండూల్కర్ క్రికెట్ లెజెండ్ అని అందరికీ తెలిసిందే. ఆయన్ను మాస్టర్ బ్లాస్టర్ అంటూ క్రికెట్ అభిమానులు కీర్తిస్తారు. ఇందుకు ఎన్నెన్నో కారణాలు, ఉదంతాలు ఉన్నాయి. అందులో మచ్చుకు ఒకటి తెలుసుకుందాం. 1990-2000ల్లో బౌలర్లు ఎక్కువగా స్వింగ్, స్పీడ్ తో భయపెట్టేవారు. స్వింగ్ ను ఎదుర్కోవడానికి సచిన్, తన టీం మేట్ అయిన ద్రవిడ్ తో కలిసి పన్నిన ఓ ఇంట్రెస్టింగ్ వ్యూహం గురించి ఇలా చెప్పాడు.

ఆ పర్యటనలో..
సచిన్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన సమయంలో అప్పటి కివీస్ టాప్ బౌలర్ క్రిస్ కెయిన్స్ ను ఎలా ఎదుర్కొన్నాడనే విషయం గురించి ఆసక్తికర విషయాలు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అక్కడి పిచ్ లు ఎక్కువగా స్వింగ్ కు, సీమ్ కు సహకరిస్తాయి. 2000లో న్యూజిలాండ్ తో టెస్టు మ్యాచ్ ఆడుతున్న సమయంలో రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఆ టైంలో క్రిస్ కెయిన్స్ రెండు వైపులా బాల్ ను స్వింగ్ చేస్తూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నాడు.
ఏం చేయను మరి అందుకే అలా చేశా
ఆ సమయంలో సచిన్, ద్రవిడ్ కలిసి ఒక ప్లాన్ వేశారు. అదేంటంటే.. క్రిస్ కెయిన్స్ బౌలింగ్ చేస్తున్న సమయంలో అతని చేతిలో బాల్ ను గమనించాలి. దాన్ని బట్టి ఆ బాల్ అవుట్ స్వింగరా లేదా ఇన్ స్వింగరా అనేది నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న వారు క్రీజులో ఉన్నవారికి సైగల ద్వారా హింట్ ఇవ్వాలి. ప్లాన్ కి తగ్గట్టు బ్యాట్ ను రైట్ సైడ్ పెడితే ఇన్ స్వింగ్ అని, లెఫ్ట్ సైడ్ పెడితే అవుట్ స్వింగ్ అని అర్థం వచ్చేలా మాట్లాడుకున్నారు. ప్లాన్ వర్కౌట్ అయింది. తన స్వింగ్ బౌలింగ్ తో ఇబ్బంది పెడుతున్న క్రిస్ కెయిన్స్ ను తమ వ్యుహ చతురతతో ఎదుర్కొని ఇద్దరు క్రీజులో నిలదొక్కుకుని బౌండరీలు బాదారు. దీంతో క్రిస్ కెయిన్స్ బౌలింగ్ లయ తప్పింది. బాల్ ను ఇష్టమొచ్చినట్లు పట్టుకుని క్రిస్ బౌలింగ్ చేశాడు. ఇది గమనించిన నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న ద్రవిడ్ బ్యాట్ ను రెండు కాళ్ల మధ్యలో పెట్టేశాడు. ఇది అర్థం కానీ క్రీజులో బ్యాటింగ్ చేస్తున్న సచిన్ ఏమైంది అలా పెట్టావ్ అని అడిగాడు. ‘మరేం చేయను మనద్దిరం అవుట్ స్వింగ్, ఇన్ స్వింగ్ వేసే సమయంలో ఎలా సైగలు చేయాలో మాట్లాడుకున్నాం. కానీ క్రిస్ మాత్రం ఇటు అవుట్ స్వింగ్, అటు ఇన్ స్వింగ్ కాకుండా ఇష్టమొచ్చినట్లు బాల్ ను చేతిలో పట్టుకున్నాడు. దీంతో బ్యాటును మధ్యలో పెట్టేశానని’ ద్రవిడ్ అన్నాడని సచిన్ తన ఇంటర్వ్యూలో తెలిపాడు. దీంతో అక్కడున్నవారు మొత్తం పగలబడి నవ్వుకున్నారు. ఇలా ప్రతి విషయంలో సచిన్ టెండూల్కర్ తాను బ్యాటింగ్ చేసే సమయంలో క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసేవాడు. నిశిత పరిశీలన ద్వారా బౌలర్లను రీడ్ చేసేవాడు. అందుకే సచిన్ మాస్టర్ బ్లాస్టర్ గా క్రికెట్ ప్రపంచంలో వెలుగొందాడు.