Why Shreyas is the Best No.4: నంబర్ 4లో అతనే బెస్ట్ ఎందుకంటే..?

Why Shreyas is the Best No.4: ఒక దశలో టీమిండియాకు వన్డేల్లో నంబర్ 4వ స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారు? అనేది పెద్ద చర్చనీయాంశంగా ఉండేది. ఆ స్థానంలో చాలామందిని ప్రయత్నించినా కుదురుగా ఆడేవారు కాదు. కానీ ఆ స్దానానికి శ్రేయాస్ అయ్యర్ రూపంలో నిఖార్సైన బ్యాటర్ టీమిండియాకు దొరికాడు. ఇన్నింగ్స్ లో అతి కీలకమైన నంబర్ 4వ స్థానంలో చక్కగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో దుబాయిలో ఆదివారం జరిగిన మ్యాచ్ లో అతని ఇన్నింగ్స్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అనే చెప్పాలి. ఈ మ్యాచ్ లో భారత్ 44 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

image credit : X

ఇన్నింగ్స్ నిర్మాణ బాధ్యత 

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ సైతం బౌలింగ్ కు అనుకూలించింది. బ్యాటింగ్ కు దిగిన ఇండియా 30పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. గిల్ (2), రోహిత్ (15), కోహ్లీ (11) రూపంలో టాపార్డర్ పెవిలియన్ బాట పట్టింది. అప్పుడు ఇన్నింగ్స్ నిర్మాణ బాధ్యతను శ్రేయాస్ అయ్యర్ తీసుకున్నాడు. అయ్యర్ (98 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు 79పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడి పరిస్థితి చక్కదిద్దాడు.

తన పాత్రేంటో తెలిసినవాడు

పిచ్ పూర్తిగా స్పిన్ కు సహకరిస్తుందని తెలుసుకుని అందుకు తగ్గట్లు అడపాదడపా బౌండరీలు బాదుతూ వికెట్ చేజారకుండా చూసుకున్నాడు. అక్షర్ పటేల్(61 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 42 పరుగులు)తో కలిసి ఓ స్టేజికి తీసుకువచ్చాడు. సరిగ్గా నంబర్ 4వ స్థానంలో ఆడే ప్లేయర్ ఎలాంటి పాత్ర పోషించాలో అలాంటి పాత్ర పోషించాడు. చివర్లో హార్దిక్ పాండ్యా(45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45 పరుగులు) రాణించడంతో ఇండియా 249 పరుగులు చేయగలిగింది. తర్వాత కివీస్ వరుణ్ చక్రవర్తి (5-42) ధాటికి 205 పరుగులకే చాప చుట్టేసింది. ఆ జట్టులో విలియమ్సన్ (120 బంతుల్లో 7ఫోర్లతో 81పరుగులు) కాస్త పోరాడాడు.

కివీస్ మీద పెత్తనం   

ఈ మ్యాచ్ మాత్రమే కాదు..  న్యూజిలాండ్ మీద అయ్యర్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. వన్డేల్లో కివీస్ మీద గత 8 ఇన్నింగ్స్ లో అతను  4 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు చేశాడు. వరుసగా 8 ఇన్నింగ్స్ లలో 103, 52, 62, 80, 49, 33, 105, 79 మొత్తంగా 70.37 సగటుతో 563 పరుగులు చేశాడు. ఇక కీలకమైన 2023 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ లో ఆ జట్టుపై  సెంచరీ (105)తో చెలరేగాడు.   

image credit : X

X ఫ్యాక్టర్ ఆటగాడు

నంబర్ 4వ స్థానంలో దిగిన ఆటగాడికి ఉండాల్సిన ప్రధాన లక్షణాలన్నీ శ్రేయాస్ లో పుష్కలంగా ఉన్నాయి. టాపార్డర్ దూకుడుగా ఆడి స్కోర్ మంచి స్థితిలో ఉంటే.. శ్రేయాస్ సైతం స్కోర్ బోర్డు వేగం మందగించకుండా దూకుడుని కొనసాగిస్తాడు. ఒకవేళ టాపార్డర్ త్వరగా ఔటైతే నిలకడగా నిలబడి వికెట్ కాపాడుతూ రన్ రేట్ పడిపోకుండా చూసుకుంటాడు. అతనో X ఫ్యాక్టర్ ప్లేయర్. గత 10 వన్డే ఇన్నింగ్స్ లలో నంబర్ 4వ స్థానంలో దిగిన అయ్యర్ వరుసగా 77, 128, 105, 4, 59, 44, 78, 15, 56, 79 పరుగులు చేశాడు. దీన్ని బట్టి అతని కన్సిస్టెన్సీ అర్థం చేసుకోవచ్చు. అయినా మొన్నమొన్నటి వరకు కూడా తుదిజట్టులో అతనికి స్థానం కచ్చితంగా ఉంటుందని చెప్పలేని పరిస్థితి. అతనో అండర్ రేటెడ్ ప్లేయర్.

ఏకైక ప్లేయర్

కీలకమైన ఐసీసీ టోర్నీలలో శ్రేయస్ జట్టుకు కీలకంగా మారుతున్నాడు. 14 ఐసీసీ ఇన్నింగ్స్ లలో 61.81 సగటుతో 104.78 స్ట్రైక్ రేట్ తో 680పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో 50 సగటుతో 3 మ్యాచ్ లలో 150 పరుగులు చేశాడు. CT-2025 సీజన్లో అతనే ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. ఇకపోతే వన్డేల్లో నంబర్ 4వ స్థానంలో 1500 కంటే ఎక్కువ పరుగులు 50 కంటే ఎక్కువ యావరేజ్ తో , 100 కి మించిన స్ట్రైక్ రేట్ తో చేసిన ఏకైక ప్లేయర్ అతనొక్కడే. అందువల్లే టీమిండియాకు బెస్ట్ నంబర్ 4 బ్యాటర్ గా శ్రేయాస్ ని పేర్కొనవచ్చు.

Leave a Comment