Ashwani Kumar : లంచ్ కూడా చేయకుండానే మ్యాచ్ ఆడి.. ముంబైను గెలిపించాడు

Ashwani Kumar: ముంబ‌యి ఇండియ‌న్స్ టీంలోని యంగ్ ఫాస్ట్ బౌల‌ర్ అశ్వ‌ని కుమార్ సోమ‌వారం కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున డెబ్యూ మ్యాచ్ లోనే నాలుగు వికెట్లు తీసి త‌న స‌త్తా చాటాడు.

అరంగ్రేట మ్యాచ్ లోనే అద‌ర‌హో..

అరంగ్రేట మ్యాచ్ లో వేసిన మొద‌టి బంతికే సీనియ‌ర్ బ్యాట‌ర్, కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (Kolkata Knight Riders) కెప్టెన్ అజింక్య ర‌హ‌నే ను అవుట్ చేశాడు. ఆ త‌ర్వాత రింకూ సింగ్, మ‌నీశ్ పాండే, అండ్రీ ర‌స్సెల్ లాంటి సీనియ‌ర్ బ్యాట‌ర్ల‌ను పెవిలియ‌న్ ప‌ట్టించి త‌న తొలి ఐపీఎల్ మ్యాచ్ లోనే శభాష్ అనిపించుకున్నాడు. 23 ఏళ్ల అశ్వ‌ని కుమార్ చండీగ‌ఢ్ స‌మీపంలోని ఝంజేరి ప‌ట్ట‌ణానికి చెందిన వాడు. గ‌తేడాది షేర్ ఏ పంజాబ్ టీ 20 టోర్నీలో బాగా బౌలింగ్ చేసి ముంబై ఇండియ‌న్స్ క‌ళ్ల‌లో ప‌డ్డాడు. చివ‌రి ఓవ‌ర్ల‌లో వైడ్ యార్క‌ర్లు వేయ‌డంతో అశ్వ‌ని కుమార్ కు ప‌ట్టు ఉంది.

డ్రీమ్ డెబ్యూ..

అశ్వ‌ని కుమార్ ముంబ‌యి ఇండియ‌న్స్ (Mumbai Indians) త‌ర‌ఫున అరంగ్రేటం చేసే ముందు చాలా ఒత్తిడికి గురైన‌ట్లు చెప్పాడు. నిజంగా మ్యాచ్ రోజు మ‌ధ్యాహ్నం అన్నం తిన‌లేదు. కేవ‌లం ఒక అర‌టి పండు తిని మ్యాచ్ కు సిద్ధ‌మ‌య్యాను. చాలా ఒత్తిడిలో ఉంటే ముంబై ఇండియ‌న్స్ మేనేజ్ మెంట్ మాత్రం చాలా స‌పోర్టు ఇచ్చింది. నీకు తెలిసిన ఆట.. ఒత్తిడి లేకుండా కూల్ గా ఆడు అని ఎంకరేజ్ చేసింద‌న్నాడు. దీంతో పాటు కెప్టెన్ హ‌ర్దిక్ పాండ్యా (Hardik Pandya) కూడా త‌న‌కు పూర్తి మ‌ద్ద‌తు తెలిపాడ‌ని చెప్పాడు. హ‌ర్దిక్ భయ్యా వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయ‌మ‌ని చెప్పాడు. దీంతో స‌క్సెస్ అయ్యాను. ముఖ్యంగా నేను మ్యాచ్ ఆడుతున్న టైంలో నా గ్రామంలోని ప్ర‌తి ఒక్క‌రూ మ్యాచ్ ను చూసి ఉంటారు. ఈ రోజు ఇలాంటి అవ‌కాశం రావ‌డం అందులో వికెట్లు తీయడం ఎంతో సంతోషంగా ఉంద‌ని అశ్వ‌ని కుమార్ అన్నాడు.

కేవ‌లం నాలుగే టీ20 మ్యాచ్ లు ఆడాడు

అశ్వని కుమార్ తన ఐపీఎల్ అరంగేట్రానికి ముందు నాలుగు సీనియర్ టీ 20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 2 రంజీ ట్రోఫీ (Ranji Trophy) 4 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు. అశ్వని ఒక మ్యాచ్‌లో 4 వికెట్లు తీయడం ఇదే మొద‌టి సారి కావ‌డం విశేషం . లిస్ట్ ఏ క్రికెట్‌లో 3/37 అత‌డి బెస్ట్ కాగా.. టీ20 క్రికెట్‌లో 1/19. ఐపీఎల్ అరంగ్రేటం మ్యాచ్ నాలుగు వికెట్లు తీసిన మొద‌టి భార‌త బౌల‌ర్ గా రికార్డు త‌న పేరిట లిఖించుకున్నాడు. అయితే ఐపీఎల్ 2025లో మూడో మ్యాచ్ ఆడిన ముంబయి ఇండియన్స్ కు మొదటి విజయం దక్కడంతో ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.

Leave a Comment