BCCI Central Contract: టీం ఇండియా క్రికెట్ లో ఇషాన్ కిషన్ (Ishan Kishan) డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్ మెన్. కానీ క్రమశిక్షణ రాహిత్యం వల్ల బీసీసీఐ అందించే సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. బీసీసీఐ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సెంట్రల్ కాంట్రాక్టుల జాబితా విడుదల చేసేందుకు సిద్ధమైంది. కాగా జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఇషాన్ కిషన్ కు ఈ సారి కూడా సెంట్రల్ కాంట్రాక్టు దక్కేలా కనిపించడం లేదు.
అసలు ఎక్కడ పొరపాటు జరిగిందంటే..
2024లో సౌతాఫ్రికా టూర్ (South Africa Tour) కోసం భారత జట్టు ను పంపించారు. అందులో వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా ఇషాన్ కిషన్ ఎంపికయ్యాడు. కానీ అందులో మొత్తం మ్యాచులు ఆడకుండా ఇండియాకు వచ్చేశాడు. అతడు చెప్పిన రీజన్ హెల్త్ కండిషన్ బాగోలేదని, కానీ ఈ రీజన్ చెప్పి దుబాయ్ లో చాలా ఈవెంట్లలో పాల్గొన్నాడు. దీంతో పాటు ముంబయి ఇండియన్స్ కు 2024 లో ఆడే సీజన్ కోసం ప్రైవేటు గా ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నడని వార్తలు వినిపించాయి. అయితే దీనిపై సీరియస్ అయిన అప్పటి కోచ్ రాహుల్ ద్రవిడ్ బీసీసీఐ కు సమాచారం అందించాడని.. దీంతో ఇషాన్ కిషన్ తో పాటు అదే సిరీస్ నుంచి మధ్యలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఇద్దరిపై వేటు పడింది. ముందుగా డొమెస్టిక్ క్రికెట్ ఆడితేనే సెంట్రల్ కాంట్రాక్టు ఇస్తామని వారిద్దరికీ బీసీసీఐ అల్టిమేటం జారీ చేసింది. దీంతో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ మేం రంజీ సీజన్ లో పాల్గొనేది లేదని చెప్పారు.దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ వారిద్దరిపై వేటు వేసింది. ఆ తర్వాత కాస్త చల్లబడ్డ ఇద్దరూ రంజీల్లో ఆడారు. కానీ పెద్దగా ఫర్మామెన్స్ చూపించలేదు. దీంతో ఇషాన్ కిషన్ ను, శ్రేయస్ అయ్యర్ ఇద్దరినీ జట్టులోంచి తొలగించారు.
శ్రేయస్ మాత్రం లక్కీ చాన్స్ కొట్టేశాడు…

2024 ఐపీఎల్ సీజన్ లో కోలకతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) కు ఆడిన శ్రేయస్ అయ్యర్ మాత్రం తన సత్తా చాటి ఏకంగా ఆ టీంకు కెప్టెన్ గా టైటిల్ అందించాడు. ఆ తర్వాత పరిణామాలు చకచకా మారిపోయాయి. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కోచ్ పదవి కాలం అయిపోవడం, బీసీసీఐ టీం ఇండియా కొత్త కోచ్ కోసం వెతకడం ప్రారంభించాయి. అనంతరం గౌతమ్ గంభీర్ కోచ్ గా టీం ఇండియా పదవి చేపట్టడం జరిగిపోయాయి. ఇక్కడే శ్రేయస్ అయ్యర్ తలరాత తిరిగింది. గౌతమ్ గంభీర్ పదవి చేపట్టే ముందు బీసీసీఐకి కొన్ని షరతులు పెట్టాడు. తాను అనుకున్న స్టాప్, టీం సభ్యులు, ఉంటేనే పదవి చేపడతానని చెప్పాడు. అదే విధంగా సపోర్టు స్టాప్ మొత్తాన్ని మార్చేశాడు. కేవలం ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ను మాత్రమే ఉంచాడు. ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన శ్రేయస్ ను సెలెక్ట్ చేసేలా సెలక్టర్లపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో టీం ఇండియా జట్టులో శ్రేయస్ పునరాగమనం చేశాడు. ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్ లో రాణించాడు. ఏకంగా చాంపియన్స్ ట్రోపీలో రాణించి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. గౌతమ్ గంభీర్ శ్రేయస్ అయ్యర్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిలను టీం ఇండియాకు సెలెక్ట్ చేయించి వారికి ఒక లైఫ్ ను ఇచ్చాడు.
ఇషాన్ కిషన్ కు గాడ్ ఫాదర్ లేకపోవడమే కారణమా?
ఇషాన్ కిషన్ కు పెద్దల అండ లేకపోవడంతో టీం ఇండియాకు తిరిగి సెలెక్ట్ కాలేకపోయాడు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కోల్ కతా నైట్ రైడర్స్ కు 2024 ఐపీఎల్ టైటిల్ అందిస్తే.. ఇషాన్ కిషన్ మాత్రం ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) తరఫున పేలవంగా ఆడి జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. ఇటు ఇండియా టీంకు, అటు ముంబయి ఇండియన్స్ కు దూరమయ్యాడు. కేవలం తాను చేసిన చిన్న పొరపాటు వల్ల జట్టులో స్థానం, సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయి.. ఏటు కానీ పరిస్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ సమయంలో ఐపీఎల్ 2025 కు ఇషాన్ కిషన్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆదుకుంది. వేలంలో అతడిని కొనుగోలు చేసి చాన్స్ ఇచ్చింది. దీంతో మొదటి మ్యాచ్ లోనే సెంచరీ చేసి ఔరా అనిపించుకున్నాడు.

సెంట్రల్ కాంట్రాక్టు దక్కుతుందా..
ఈ ఏడాది కాలంలో జట్టులో చాలా మార్పులు వచ్చాయి. యువకులు ఎంట్రీ ఇచ్చారు. నితీశ్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ లో అదరగొట్టాడు. టీ 20ల్లో అభిషేక్ శర్మ, బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి సూపర్ గా రాణించారు. దీంతో ఈ సారి సెంట్రల్ కాంట్రాక్టు వీరికి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో శ్రేయస్ అయ్యర్ చాంపియన్స్ ట్రోపీలో (Champions Trophy) అత్యధిక పరుగులు చేసిన ఇండియా ప్లేయర్ గా నిలవడంతో బీసీసీఐ సెలక్టర్లను తలనొప్పి మొదలైంది. ఇలాంటి ప్లేయర్ కు సెంట్రల్ కాంట్రాక్టు ఇవ్వకపోతే విమర్శలు వచ్చేలా ఉన్నాయని అనుకుంటున్నట్లు సమాచారం.
రిటైరైనా.. వారికి కోట్ల కుమ్మరింతే
ఇప్పటికే టీ 20 ఫార్మాట్ నుంచి రిటైరైనా విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ ఏ+ గ్రేడ్ ద్వారా ఏడాదికి రూ. 7 కోట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వీరిద్దరితో పాటు జస్ ప్రీత్ బుమ్రా సెంట్రల్ కాంట్రాక్టు ఏ+లో ఉన్నారు. ఇదిలా ఉండగా.. కొత్తగా నితీశ్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) అభిషేక్ శర్మలకు కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
పాపం ఇషాన్ కిషన్
వన్డేల్లో డబుల్ సెంచరీలు చేసిన అత్యంత తక్కువ మంది బ్యాటర్లలో ఇషాన్ కిషన్ ఒకరు. వేగంగా బ్యాటింగ్ చేసి పరుగులు సాధించడంలో ఇషాన్ కిషన్ కు తిరుగులేదు. కానీ క్రమశిక్షణ లోపం, చెప్పిన మాట వినకపోవడంతో టీం ఇండియాకు దూరమయ్యాడు. సెంట్రల్ కాంట్రాక్టు పోగొట్టుకున్నాడు. మరి ఈసారైనా బీసీసీఐ పెద్దలు ఇషాన్ కిషన్ ను కరుణిస్తారో లేదో చూడాలి.