Most Dramatic ODIs: న‌రాలు తెగే ఉత్కంఠ‌క‌ర వ‌న్డేలు.. ఎన్నిసార్లు చూసినా థ్రిల్లింగే

Most Dramatic ODIs: వ‌న్డేల్లో కొన్ని వ‌న్డేలు వేరయా. ప్రేక్ష‌కుల‌ను మునివేళ్ల మీద నిల‌బెట్టడం.. క్ష‌ణ‌క్ష‌ణం ఇరువైపులా దోబూచులాడే విజ‌యం.. అంతులేని ప్లేయ‌ర్ల‌ భావోద్వేగాలు.. ప్ర‌తీ సీన్ ఓ క్లైమాక్స్ లాగా ప్ర‌తీ బాల్ ప‌రేషాన్ చేస్తూ మోస్ట్ డ్రామాటిక్ గా ముగిసిన కొన్ని వ‌న్డేల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Most Dramatic ODI: స్టోక్స్ దెబ్బ‌కు న్యూజిలాండ్ కు స్ట్రోక్

2019 ఏడాది ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఫైన‌ల్ అది. క్రికెట్ కు పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ గ‌డ్డ మీద పోరు. సొంత గ‌డ్డ మీద ఆడుతున్న ఇంగ్లాండ్, అద్భుత విజ‌యాల‌తో ఫైన‌ల్ చేరిన న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకుంటున్నాయి. అప్పటి వరకు వరల్డ్ కప్ అందుకోని ఇంగ్లాండ్.. ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో అద్భుతం చేసింది. క‌డ‌వ‌ర‌కు న‌రాలు బిగ‌ప‌ట్టి చూసిన మ్యాచ్ లో చివ‌ర‌కు డ్రామాటిక్ గా న్యూజిలాండ్ పై విజయం సాధించి వరల్డ్ కప్ అందుకుంది.

ఈ మ్యాచ్ లో తొలుత కివీస్ 241 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో ఇంగ్లాండ్ ఒత్తిడిలో పడినా, బెన్ స్టోక్స్ (84ప‌రుగులు) అసాధారణ పోరాటం చేశాడు. ఈ మ్యాచ్ లో ట‌ర్నింగ్ పాయింట్లు ఎన్నో ఉన్నాయి.. అందులో మ్యాచ్ చివ‌ర్లో గ‌ప్టిల్ విసిరిన త్రో.. యాక్సిడెంట‌ల్ గా డైవ్ చేస్తున్న స్టోక్స్ బ్యాట్ కు తాకి బౌండ‌రీ వెళ్లింది. దీంతో ఆ బాల్ కు 6 ప‌రుగులొచ్చాయి. స్టోక్స్ వీరోచిత పోరాటం వ‌ల్ల స్కోర్లు స‌మ‌మై మ్యాచ్ సూపర్ ఓవర్ కు చేరుకుంది. సూపర్ ఓవర్‌లో ఇంగ్లాండ్ 15ప‌రుగులు చేయ‌గా.. ఛేద‌న‌కు దిగిన కివీస్ చివ‌రి బంతికి 2 ప‌రుగులు చేయాల్సి వ‌చ్చింది. అయితే గ‌ప్టిల్ డీప్ మిడ్ వికెట్ దిశ‌గా షాట్ ఆడి 2వ ప‌రుగు తీసే స‌మ‌యంలో బంతి అందుకున్న జాస‌న్ రాయ్.. నేరుగా కీప‌ర్ బ‌ట్ల‌ర్ చేతికి విస‌ర‌గా వెంట‌నే అత‌ను వికెట్ల‌ను గిర‌టేశాడు. దీంతో స్కోర్లు సమమ‌య్యాయి. బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్ విజయం సాధించి విజ‌య సంబ‌రాలు జ‌రుపుకుంది. గ‌ప్టిల్ తో పాటు కివీస్ క్రికెట‌ర్లు అంద‌రూ నివ్వెర‌పోయి శోక‌సంద్రంలో మునిగిపోయారు. ఇది ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత నాటకీయ ముగింపు కలిగిన ఛేజింగ్ మ్యాచ్ అని చెప్ప‌వ‌చ్చు. ఇప్ప‌టికీ ఈ విజ‌యం కివీస్ దే అంటూ ఎన్నో విమ‌ర్శ‌లున్నాయి. ఏదేమైనా ఇంగ్లాండ్ త‌ర‌ఫున ఆడుతున్న న్యూజిలాండ్ మూలాలున్న స్టోక్.. ఆ దేశానికి స్ట్రోక్ ఇచ్చాడు.

గంగూలీ చొక్కా విప్పి..

2002లో నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మ‌ధ్య లార్డ్స్ వేదిక‌గా జ‌రిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 325 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. ఛేజింగ్‌లో సచిన్, సెహ్వాగ్ తక్కువ స్కోర్‌కే వెనుదిరగడంతో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లాండ్ వైపే మొగ్గింది. అయితే యువరాజ్ సింగ్, మొహమ్మద్ కైఫ్ కలిసి 121 పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్ గ‌తిని తిరగరాశారు. చివరికి భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. కెప్టెన్ గంగూలీ తన జెర్సీ విప్పి లార్డ్స్ బాల్కనీలో సంబరాలు చేసుకున్నాడు. ఆ క్షణం ఇప్ప‌టికీ భారత క్రికెట్ చరిత్రలో ఓ అపురూప దృశ్యంగా మారిపోయింది.

నెట్ ర‌న్ రేట్ ఆధారంగా

1999లో వన్డే వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మ‌ధ్య సెమీఫైనల్ డ్రామా అంతా ఇంతా కాదు. ఈ మ్యాచ్ ప్రపంచ కప్‌లో అత్యంత ఉత్కంఠభరితమైన ఛేజింగ్ మ్యాచులలో ఒకటిగా నిలిచింది. దక్షిణాఫ్రికా 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి పోరాడింది. లాన్స్ క్లూసెనర్ చివరి ఓవర్లో అద్భుతమైన షాట్లతో గెలుపు దగ్గరికి తీసుకువచ్చాడు. స్కోర్లు స‌మ‌మ‌య్యాయి. అయితే 11వ బ్యాట‌ర్ అలెన్ డొనాల్డ్ రనౌట్ కావడంతో మ్యాచ్ టై అయింది. అయితే అప్ప‌ట్లో సూప‌ర్ ఓవ‌ర్ అనే కాన్సెప్ట్ లేదు. దీంతో ఆస్ట్రేలియా అప్పటికే గ్రూపు స్టేజ్ లో సౌతాఫ్రికాను ఓడించడంతో పాటు నెట్ రన్ రేట్ ఆధారంగా ఆసీస్ గెలిచిన‌ట్లు మ్యాచ్ రిజ‌ల్ట్స్ ఇచ్చారు. దీంతో ఆస్ట్రేలియా ఫైనల్‌కు వెళ్లింది. ఇక అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ద‌క్షిణాఫ్రికాను ఎప్పుడూ నాకౌట్ మ్యాచ్ ల‌లో బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది.

అరివీర భ‌యంక‌ర ఛేజింగ్

2006లో ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ ప్రపంచ క్రికెట్ చ‌రిత్ర‌లో అద్భుతమైన ఛేజింగ్ మ్యాచ్ గా పేరొందింది. 2006 మార్చి 12న జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఈ వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 434 పరుగుల భారీ స్కోరు సాధించింది. అప్పటి వరకూ వన్డే క్రికెట్‌లో నమోదైన అత్యధిక స్కోరు ఇదే. ఆస్ట్రేలియా తరఫున రికీ పాంటింగ్ 164 (105) పరుగులతో విరుచుకుపడ్డాడు. అయితే, దక్షిణాఫ్రికా ఛేజింగ్‌లో అద్భుతమైన పోరాటం చేసింది. మ్యాచ్ చూస్తున్నంత సేపు విజ‌యం ఇరువైపులా దోబూచులాడుతుంది. బంతి బంతికి సమీకరణాలు మారుతుంటాయి. గ్రేమ్ స్మిత్ (90) హెర్షెల్ గిబ్స్ (175) విజృంభించి మ్యాచ్‌ను దక్షిణాఫ్రికా వైపు తిప్పారు. చివరి ఓవర్లలో ఒత్తిడితో మ్యాచ్ ఉత్కంఠగా మారినప్పటికీ, మార్క్ బౌచర్ 50 పరుగులతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఒక్క బంతి మిగిలి ఉండగా బౌండ‌రీ బాది ద‌క్షిణాఫ్రికాకు అపురూప‌ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ వన్డే క్రికెట్‌లో అత్యంత గొప్ప ఛేజింగ్‌గా మాత్రమే కాకుండా, మోడ్రన్ క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ డామినేషన్‌కు నాంది పలికింది. అప్పటి వరకు 400+ ఛేజింగ్ అసాధ్యం అనే భావనను దక్షిణాఫ్రికా చెరిపేసింది. ఈ గెలుపు క్రికెట్ ప్రేమికులకు ఎప్పటికీ గుర్తుండిపోయే దృశ్యంగా మారిపోయింది.

Leave a Comment