One match hundred memories : వన్డే క్రికెట్ లో 438 పరుగుల మ్యాచ్. 2006 మార్చిలో సౌతాఫ్రికాలోని జోహెనెస్ బర్గ్ లో జరిగిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ లో ఎన్నో ఇంట్రస్టింగ్ విషయాలు, రికార్డుల బ్రేకింగ్ లు, బంతి బంతికి ఉత్కంఠ, సిక్సుల మోత, ఆఖరి బంతి వరకు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాట.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క మ్యాచ్.. వంద జ్ఞాపకాలు.. అప్పటికీ టీ 20 క్రికెట్ లో ప్రపంచ వ్యాప్తంగా ఆరు మ్యాచులే జరిగాయి. అయినా టీ 20ని తలపించే షాట్లు.. కొడితే స్టాండ్ లోకి వెళ్లే బంతులు.. ప్రేక్షకుల చప్పట్లు.. టీవీల ముందు కూర్చున్న సగటు క్రికెట్ అభిమానుల గుండెల్లో ఉత్కంఠ. ఒక్కటేమిటి.. వన్డే క్రికెట్ కు ప్రాణం పోసిన మ్యాచ్. క్రికెట్ ఉన్నంత కాలం ఉండే గొప్ప మ్యాచ్. దాని గురించి ఇంట్రస్టింగ్ విషయాలు కొన్ని తెలుసుకుందాం..
One match hundred memories ఆకాశమే హద్దుగా రికీ పాంటింగ్ చెలరేగిన వేళా..

2006 ఫిబ్రవరి మార్చిలో అయిదు వన్డే ల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా పర్యటనకు ఆస్ట్రేలియా వెళ్లింది. నాలుగు మ్యాచులకు చెరో రెండు గెలిచి నిర్ణయాత్మకమైన అయిదో మ్యాచ్ కు రెడీ అయ్యాయి. జోహెనెస్ బర్గ్ లో ఫైనల్. ఎవరూ గెలిస్తే వారికే సిరీస్ దక్కుతుంది. 2006 మార్చి 12 న జరిగిన మ్యాచులో ఎప్పటిలాగే ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. దూకుడుకు మారు పేరైనా అడమ్ గిల్ క్రిస్ట్ తన స్టైల్ లో దంచికొట్టాడు. మరో ఓపెనర్ సైమన్ కటిచ్ కూడా తగ్గేదేలే అన్నట్లు ఆడారు. ఇద్దరు కలిసి 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky Ponting) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 164 పరుగులు చేసి సిక్సర్ల మోత మోగించాడు.
మొత్తంగా రికీ పాంటింగ్ ఆడిన తీరుకు దక్షిణాఫ్రికా బౌలర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. ఆ తర్వాత వచ్చిన మైక్ హస్సీ (Mike Hussey) కూడా 51 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు. దీంతో ఆసీస్ తన మొదటి ఇన్సింగ్స్ ముగిసే సరికి 434 పరుగుల రికార్డు స్కోరు చేసింది. ఇంకేముంది రికార్డులు బద్దలు.. వన్డే ల్లో అత్యధిక స్కోరు ఇదే అంటూ బ్రేకింగ్ లు. ఇది కచ్చితంగా ఛేజ్ చేసే స్కోరు మాత్రం కాదంటూ విమర్శలు. ఈ మ్యాచులో 13 ఫోర్లు, 9 సిక్సులతో రికీ పాంటింగ్ 164 పరుగులు చేయగా.. ఆసీస్ మొత్తం ఇన్సింగ్స్ లో 14 సిక్సులు బాదింది. దీంతో రికీ పాంటింగ్ కూడా వ్యక్తిగతంగా పెద్ద స్కోరు తన పేరిట లిఖించుకున్నాడు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు..

దక్షిణాఫ్రికా (South Africa cricket team)435 పరుగుల ఛేజింగ్ కు దిగింది. ఆదిలోనే ఓపెనర్ బోతా డిపెనర్ ను నాథన్ బ్రాకెన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత వన్ డౌన్ లో దిగిన హెర్షల్ గిబ్స్, సౌతాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఇద్దరు కలిసి ఆసీస్ బౌలింగ్ ను కకావికాలం చేసేశారు. బంతిపడితే చాలు సిక్సులు, ఫోర్లలో హడలెత్తించారు. ఆస్ట్రేలియా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (Graeme Smith) 55 బంతుల్లోనే 90 పరుగులు చేసి దనాధన్ ఇన్సింగ్స్ ఆడాడు. మరో వైపు హెర్షల్ గిబ్స్ కూడా 7 సిక్సులు, 21 ఫోర్లతో 111 బంతుల్లోనే 175 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో సౌతాఫ్రికా ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. జాక్వస్ కలిస్ సరిగా ఆడలేకపోయాడు. కానీ ఆ తర్వాత వచ్చిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు, అందరూ తలో చేయి వేశారు. వండర్ వాత్ 30 పరుగులు చేయగా.. మార్క్ బౌచర్ 50 పరుగులతో చివరి వరకు నిలిచి సౌతాఫ్రికాకు మధురమైన విజయాన్ని అందించాడు.
బంతి బంతికి ఉత్కంఠ..
చివరి ఓవర్ అయిదో బంతి వరకు సాగిన ఈ మ్యాచ్ లో బంతి, బంతికి ఉత్కంఠ నెలకొంది. బ్రెట్ లీ బౌలింగ్ లో చివరి రెండు వికెట్లు ఉన్న సమయంలో అండ్రూ హాల్ ను 433 పరుగుల టీం స్కోరు వద్ద అవుట్ చేశాడు. దీంతో చివరి వికెట్ మకయా ఎన్తినీ బ్యాటింగ్ కు వచ్చాడు. వికెట్ పడితే అప్పటి వరకు ఆడిందంతా బూడిదలో పోసిన పన్నీరే.. సౌతాఫ్రికా ఓడిపోతుంది.. ఆస్ట్రేలియా గెలుస్తుంది. మ్యాచ్ తో పాటు సిరీస్ ఎగరేసుకుపోతుంది. ఇటు సౌతాఫ్రికా గెలిచినా.. 434 పరుగులు చేసి మ్యాచును సరిగా ముగించలేకపోవడం దారుణమైన విషయంగా మారిపోతుంది.
ఇలా రెండు జట్లు ప్రాణం పెట్టి ఆడాయి. రికీ పాంటింగ్ వ్యుహాలు.. బ్రెట్ లీ పేస్ బౌలింగ్ ను ఎదుర్కొని సౌతాఫ్రికా బౌలర్ అయినా ఎన్తీని చివరి బ్యాట్స్ మెన్ గా బౌలింగ్ చేస్తూ థర్డ్ మ్యాన్ వైపు సింగిల్ తీసేశాడు. అంతే స్కోర్లు సమం అయిపోయాయి. దీంతో స్టేడియంలో ఉన్న వేలాది మంది సౌతాఫ్రికా ఫ్యాన్స్ ఎగిరి గంతేశారు. హమ్మయ్య ఓడిపోలేం.. ఇక చేయాల్సింది. ఒక్క పరుగే రెండు బంతులున్నాయి. క్రీజులో మార్క్ బౌచర్ ఉన్నాడు. దీంతో గెలుపు ఖాయం అని అనుకున్నారు. అనుకున్నట్లు గానే ఒక బాల్ మిగిలి ఉండగానే మార్క్ బౌచర్ (Mark Boucher) బ్రెట్ లీ బౌలింగ్ లో మిడ్ ఆన్ మీదుగా బౌండరీ కొట్టి సౌతాఫ్రికాకు మధురమైన విజయాన్ని అందించాడు. దీంతో స్టేడియంలో ఉన్న అందరూ సంబరాల్లో మునిగిపోయారు. కొంతమంది మాత్రం కన్నీటి పర్యంతమయ్యారు
వన్డేల్లో ది బెస్ట్ మ్యాచ్ ఇదే..

అయితే ఒకే మ్యాచ్ లో రెండు భారీ సెంచరీలు, ఆసీస్ తరఫున రెండు అర్థ సెంచరీలు, సౌతాఫ్రికా తరఫున రెండు అర్థ సెంచరీలు, ఒక టీం 434 పరుగులు చేస్తే మరో టీం 438 పరుగులు చేసింది. దీంతో రెండు ఇన్సింగ్స్ లలో కలిపి 872 పరుగుల వన్డే మ్యాచ్ గా మారింది. అప్పటి వరకు 300 నుంచి 350 చేయడమే గొప్ప.. కానీ ఏకంగా 434 స్కోరు చేయడం దాన్ని కాపాడుకోలేకపోవడం ఆసీస్ బాధ కలిగిస్తే.. అంత స్కోరు సమర్పించుకున్ననా.. దాన్ని నిలబెట్టుకోవడం కోసం చివరి వరకు పోరాడి గెలవడం గొప్ప విషయం. వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటికీ ఎప్పటికీ ఇది బెస్ట్ మ్యాచ్ గా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
ఉత్కంఠకు నిదర్శనం
ఈ మ్యాచ్ లో బెస్ట్ ఇన్సింగ్స్ లు ఆడిన రికీ పాంటింగ్, హెర్షల్ గిబ్స్ (Herschelle Gibbs)లకు సంయుక్తంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రకటించారు. ఇంత భారీ పరుగుల మ్యాచులో కూడా నాథన్ బ్రాకెన్ ఆస్ట్రేలియా బౌలర్ 65 పరుగులిచ్చి అయిదు వికెట్లు తీశాడు. మ్యాచ్ ప్రారంభం అయినపుడు ఎవరూ కూడా ఇంత భారీ స్కోరు మ్యాచ్ అవుతుందని అనుకోలేదు. ఇంతలా ఉత్కంఠ కలిగిస్తుందని ఎవరూ ఊహించలేరు. కానీ వన్డేల్లో ది బెస్ట్ మ్యాచ్ గా నిలిచిపోయింది. సగటు క్రికెట్ అభిమాని ఎంతో గానో ఇష్టపడే మ్యాచుల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది. కానీ ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో మూడు మ్యాచులు గెలిచి ఆస్ట్రేలియా తన ప్రతీకారం తీర్చుకుంది.