Top 5 Chases of Kohli against Pak : పాకిస్థాన్ always షాకిస్తాన్

Top 5 Chases of Kohli against Pak: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆదివారం పాక్ తో జ‌రిగిన మ్యాచ్ లో టీమిండియాకు విరాట్ కోహ్లీ త‌న‌దైన స్టైల్లో విజ‌యాన్ని అందించిన సంగ‌తి తెలిసిందే. క‌డ‌వ‌ర‌కు క్రీజులో ఉండి తాను వ్య‌క్తిగ‌తంగా సెంచ‌రీ పూర్తి చేస్తూ విన్నింగ్ షాట్ తో మ్యాచ్ ముగించాడు. భార‌త చిర‌కాల ప్ర‌త్య‌ర్థి అయిన పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే కోహ్లీ త‌న అమ్ముల‌పొదిలో ఉన్న అన్ని బ్యాటింగ్ అస్త్రాల‌ను సంధిస్తాడు. ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా.. క్రీజులో పాతుకుపోయి గెలుపు అంచును ముద్దాడుతాడు. నిన్న‌టి మ్యాచ్ అనే కాదు.. ఇండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ ల‌లో ఎన్నోసార్లు చిర‌స్మ‌ర‌ణీయ ఇన్నింగ్స్ ఆడాడు. వాటిలో టాప్ 5ని ఓసారి గ‌నుక చూస్తే..

Chases of Kohli :తొలిసారి విరాటుడి వీర‌ప్ర‌తాపం..

2012 ఆసియా కప్ గేమ్ టోర్నీ అది. బంగ్లాదేశ్ లోని మీర్పూరులో పాక్ వ‌ర్సెస్ ఇండియా మ్యాచ్. అప్పుడ‌ప్పుడే విరాట్ అంటే క్రికెట్ జ‌గ‌త్తుకు కాస్త ప‌రిచ‌యం అవుతున్న రోజుల‌వి. కానీ ఈ మ్యాచ్ ద్వారా అత‌నే భావి భార‌త క్రికెట్ కింగ్ అవుతాడ‌ని నిరూపించాడు. ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్ టీం చాలా దుర్భేద్యంగా ఉండేది. ఆ మ్యాచ్ లో పాక్ ఓపెన‌ర్లు హాఫీజ్, న‌సీర్ సెంచ‌రీల‌తో చెల‌రేగ‌డంతో 329 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. ఇక 300 పైచిలుకు టార్గెట్ అంటే ఆ రోజుల్లో దాదాపు ఓట‌మి ఖాయ‌మ‌నుకునేవారంతా. కానీ అప్పుడే కోహ్లీ త‌న ఛేజ్ ప‌టిమ‌ను చూపించాడు. ఎక్క‌డా నెట్ ర‌న్ రేట్ త‌గ్గ‌కుండా స‌చిన్ (52), రోహిత్ (68)తో క‌లిసి భాగ‌స్వామ్యాలు నిర్మిస్తూ గెలుపున‌కు బాట‌లు వేశాడు. ఈ క్ర‌మంలో స్టేడియం న‌లుదిక్కులా 22ఫోర్లు, 1 సిక్స‌ర్ బాది ఔరా అనిపించాడు. 148 బంతుల్లోనే 183 పరుగులు చేసి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించాడు. పాక్ బౌల‌ర్ల‌ను గ్యాప్ షాట్ల‌తో చెడుగుడు ఆడాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో మ‌రో 2 ఓవ‌ర్లుండ‌గానే గెలుపు తీరం చేరుకుంది.

Chases of Kohli : త‌లుచుకుంటే వార్ వ‌న్ సైడే

శ్రీలంకలో జరిగిన 2012 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో కోహ్లీ త‌న ధాటి చూపించాడు. 61బంతుల్లో 8ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 78 పరుగులు చేసి.. మ్యాచ్ వ‌న్ సైడ్ చేశాడు. ఈ మ్యాచ్ లో ఇండియా 8 వికెట్ల తేడాతో భారీ విజ‌యం సాధించింది. తొలుత ఇండియా బౌలర్లు పాకిస్తాన్‌ను 128 పరుగులకే క‌ట్ట‌డి చేశాడు. త‌ర్వాత ఛేజ్ మాస్ట‌ర్ కోహ్లీ చూసుకున్నాడు.

Chases of Kohli : ఎలా ముగించాలో తెలిసిన‌వాడు

ఇండియాలో 2016 T20 ప్రపంచ కప్ టోర్నీ జ‌రిగింది. ఈ మ్యాచ్ లో కోల్ క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాక్ తో గ్రూప్ స్టేజి మ్యాచ్ ప‌ట్ల అభిమానుల ఉత్కంఠ తార‌స్థాయికి చేరుకుంది. ఇక తొలుత పాక్ 118 పరుగులు మాత్ర‌మే చేయ‌డంతో ఇక ఇండియా విజ‌యం లాంఛ‌న‌మే అనుకున్నారంతా. అయితే 23ప‌రుగుల‌కే ఇండియా ధావ‌న్, రోహిత్, రైనా రూపంలో 3వికెట్లు కోల్పోయింది. దీంతో టెన్ష‌న్ నెల‌కొంది. కానీ మ‌రో ఎండ్ లో కోహ్లీకి ఛేజ్ ఎలా చేయాలో తెలుసు. ఇక యువీ తోడుగా నెమ్మ‌దిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించాడు. క‌డ‌వ‌ర‌కు క్రీజులో ఉండేలా చూసుకున్నాడు. ఇక 37బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స‌ర్ల‌తో 55నాటౌట్ చేసి మ్యాచ్ ముగించాడు.

Chases of Kohli: పాక్ అభిమానులు గుక్క‌ప‌ట్టి ఏడ్చిన రోజు..

ఆస్ట్రేలియాలో టీ20-2022 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాలోని ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఓ థ్రిల్ల‌ర్ మ్యాచ్ జ‌రిగింది. తొలుత ఈ మ్యాచ్ లో పాక్ 159ప‌రుగులు చేసింది. అనంత‌రం ఛేద‌న‌కు దిగిన ఇండియాకు గ‌ట్టి దెబ్బ త‌గిలింది. 31కే 4వికెట్లు కోల్పోయి నిస్స‌హాయ స్థితికి చేర‌కుంది. అప్పుడు పాండ్యా (40)తో క‌లిసి మ్యాచ్ ను కోహ్లీ(82ప‌రుగులు 53బంతుల్లో) ఓ ద‌శ‌కు తెచ్చాడు. కానీ చివ‌రి 2ఓవ‌ర్ల‌లో 31ప‌రుగులు చేయాలి. అప్పుడు కోహ్లీ మ్యాజిక్ చేశాడు. 19వ ఓవ‌ర్ హరిష్ రౌఫ్ వేయ‌గా చివ‌రి రెండు బాల్స్ సిక్స‌ర్లుగా మ‌లిచాడు. చివ‌రి ఓవ‌ర్లో 16ప‌రుగులు అవ‌స‌రం కాగా.. ఓ సిక్స్ స‌హా కావాల్సిన ప‌రుగులు రాబ‌ట్టాడు. ఇక చివ‌ర్లో అశ్విన్ చాక‌చ‌క్యంగా వైడ్ త‌ప్పించుకోవ‌డంతో మ్యాచ్ టై అయింది. చివ‌రి బంతికి ర‌న్ తీసి గెలుపు అంచు చేరుకున్నారు. ఆ మ్యాచ్ పాక్ చివ‌రి బంతికి ఓడిపోవ‌డంతో పాక్ అభిమానులు గుక్క‌ప‌ట్టి ఏడ్చారు.

సెంచ‌రీతో విన్నింగ్ షాట్

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో భాగంగా పాక్ తో జ‌రిగిన మ్యాచ్ లో మ‌రోసారి పాక్ జ‌ట్టుకు కోహ్లీ పీడ‌క‌ల‌లు మిగిల్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులు చేసింది. సౌద్ షకీల్(62), కెప్టెన్ రిజ్వాన్ (46), కుష్దిల్ షా(38) ఆ జ‌ట్టును కాస్త ఆదుకున్నారు. భార‌త బౌల‌ర్ల‌లో కుల్దీప్ (3/40), పాండ్యా (2/31) రాణించ‌గా.. అక్షర్, జ‌డ్డూ, హ‌ర్షిత్ ఒక్కో వికెట్ తీసారు. ఛేద‌న‌కు దిగిన భార‌త్ రోహిత్ (20) రూపంలో 31ప‌రుగుల వ‌ద్ద ఓ వికెట్ కోల్పోయింది. అప్పుడు మ‌న ఛేజ్ మాస్ట‌ర్ కోహ్లీ దిగాడు. గిల్ (46)తో హాఫ్ సెంచ‌రీ, శ్రేయాస్ అయ్యర్ (56)తో సెంచ‌రీ భాగస్వామ్యాన్ని నెల‌కొల్పి ఇండియాదే ఇక మ్యాచ్ అనే స్టేజీకి తెచ్చాడు. ఈ క్ర‌మంలో (111 బాల్స్ లో 100ర‌న్స్) సెంచ‌రీ పూర్తి చేసుకుంటూ విన్నింగ్ షాట్ కొట్టాడు.

స‌చిన్ రికార్డ్ బ‌ద్ధ‌లు

ఇక తాజా మ్యాచ్ ద్వారా వ‌న్డేల్లో 14 వేల ప‌రుగుల మార్కును కోహ్లీ అందుకున్నాడు. జ‌స్ట్ 287 ఇన్నింగ్స్‌లలోనే ఈ మైలురాయి చేరుకుని సచిన్ టెండూల్కర్ రికార్డు కొల్ల‌గొట్టాడు. 14000 ప‌రుగుల మైలురాయి చేరుకోవ‌డానికి స‌చిన్ కు 350 ఇన్నింగ్స్‌లు ప‌ట్టింది. కుమార సంగక్కర 378 ఇన్నింగ్స్‌లలో 14వేల ప‌రుగులు చేశాడు. అలాగే కోహ్లీ వ‌న్డేల్లో అత్య‌ధిక క్యాచ్ లు అందున్న ఇండియ‌న్ ప్లేయ‌ర్ గాను రికార్డు నెల‌కొల్పాడు. కోహ్లీ ఇండియా తరపున 158 క్యాచ్‌లు పట్టి, అంత‌కుముందు అజారుద్దీన్ (156 క్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును తిర‌గ‌రాశాడు.

Leave a Comment