Ind vs Pak CT-2025: నానాటి రైవ‌ల్రీ.. ఆనాటి ఓట‌మి.. నేటి గెలుపు క‌ల‌

Ind vs Pak CT-2025 : ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆట‌ప‌రంగానే కాకుండా భావోద్వేగాల స‌మ‌రం. ట్రోఫీ గెలిచిన దానికంటే ఒక‌దానిపై మ‌రో జ‌ట్టు గెలిస్తే ఆ దేశ క్రికెట్ అభిమానుల‌కు క‌లిగే విజ‌య‌పు కిక్కు మామూలుగా ఉండ‌దు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 23న‌ ఆదివారం దాయాదులైన పాకిస్థాన్, టీమిండియా మ‌ధ్య దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో హైఒల్టేజ్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 2017 ఫైన‌ల్లో పాక్ చేతిలో ఓడిన భార‌త్.. ఈ మ్యాచ్ గెలుపుతో ప్రతీకారం తీర్చుకోవాల‌ని చూస్తుంది. ఈ మ్యాచ్ ఇండియా గెలిస్తే సొంత గ‌డ్డ‌పై జ‌రుగుతున్న ఐసీసీ టోర్నీలో లీగ్ ద‌శ‌లోనే పాక్ వైదొలిగి అప్ర‌దిష్ట మూట‌గ‌ట్టుకుంటుంది. 2017లో ఇండియా ఓట‌మి భార‌త అభిమానుల‌ను బాగా నిరాశ‌కు గురిచేసింది.

ఆ మ్యాచ్ లో ఏం జ‌రిగిందంటే..

2017 ఎడిషన్ ఫైనల్ చేరుకున్న పాక్, ఇండియాలో తొలుత టైటిల్ ఫేవ‌రేట్ గా ఇండియానే ఉంది కాబ‌ట్టి మ్యాచ్ మ‌న‌మే గెలుస్తామ‌ని స‌గ‌టు అభిమాని ఫిక్స‌య్యాడు. పాక్ కాస్తో కూస్తో ట‌గ్ ఆఫ్ వార్ ఇస్తుంద‌నుకున్నారు. కానీ అనూహ్యంగా తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. ఏకంగా 338 ప‌రుగులు చేసింది. ఫ‌ఖ‌ర్ జ‌మాన్ సెంచ‌రీ చేశాడు. అయినా మ‌న బ్యాటింగ్ లైన‌ప్ చూశాక టార్గెట్ పెద్ద‌గా ఉన్నా.. పెద్ద ప‌ర్వాలేద‌నిపించింది. కానీ మ‌న బ్యాటింగ్ మొద‌ల‌య్యాక ప‌రిస్థితి ఉల్టాప‌ల్టా అయింది. మ‌హ‌మ్మ‌ద్ అమిర్ చెల‌రేగి బౌలింగ్ చేశాడు. రోహిత్ డ‌కౌట్, కోహ్లీ 5, ధావ‌న్ 21ల‌ను పెవిలియ‌న్ కు పంపించాడు. దీంతో 33ప‌రుగుల‌కే 3వికెట్లు కోల్పోయిన భార‌త్ ఇక ఏ ద‌శ‌లోను కోలుకోలేదు. యువీ 22, ధోని 4, కేదార్ జాదవ్ 9, రవీంద్ర జడేజా 15 పూర్తిగా నిరాశ‌ప‌రిచారు. అయితే ఉన్నంత సేపు పాక్ ను హర్దిక్ పాండ్యా ఒక ఆట ఆడుకున్నాడు. 43 బంతుల్లో 4ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో 76 పరుగుల అద్భుత‌ ఇన్నింగ్స్ ఆడాడు. అత‌ని జోరు చూస్తే అద్భుతం జ‌రుగుతుందేమోన‌నిపించింది. కానీ బ్యాడ్ ల‌క్ ర‌నౌట్ అయ్యాడు. దీంతో ఇండియా 158 పరుగులకు చాప చుట్టేసింది.

ప్లేయ‌ర్ల మ‌ధ్య ఫైట్..

ఇండియా వ‌ర్సెస్ పాక్ అంటే ఆట‌గాళ్ల మ‌ధ్య కూడా భావోద్వేగాలు ఎక్కువే. ఇరు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన ప‌లు మ్యాచ్ ల‌లో ప్లేయ‌ర్ల మ‌ధ్య గొడ‌వ‌ల‌య్యాయి. వాటి గురించి ఓసారి లుక్కేస్తే..


* 2004 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సంద‌ర్భంగా జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త మిస్ట‌ర్ డిపెండ‌బుల్ రాహుల్ ద్రవిడ్ సైతం పాక్ ప్లేయ‌ర్ షోయబ్ అక్తర్ చేష్ట‌ల‌కు కోపానికొచ్చాడు. అక్త‌ర్ త‌న నోటిదూల కార‌ణంగా క‌వ్వించే ప్ర‌య‌త్నం చేయ‌డంతో ఇరువురి మ‌ధ్య గ‌ట్టి వాద‌న జ‌రిగింది. నువ్వానేనా అన్న‌ట్లు ఎదురెదురుప‌డ్డారు. గ్రౌండ్లో అంపైర్లు, పాక్ కెప్టెన్ ఇంజ‌మామ్ స‌ర్దిచెప్పి వాద‌న ముగించారు.


* 2007లో ఇండియాలో వ‌న్డే సిరీస్ జ‌ర‌గ‌గా.. ఆనాడు భార‌త ఓపెన‌ర్ అయిన‌ గౌతమ్ గంభీర్ కు, పాక్ స్టార్ ప్లేయ‌ర్ షాహిద్ అఫ్రిదికి గొడ‌వైంది. ర‌న్ తీసే స‌మ‌యంలో ఇరువురు ఢీకొన‌డంతో వాడీవేడి వాద‌న‌లు చోటుచేసుకున్నాయి. అంపైర్లు ఇద్ద‌రికి స‌ర్దిచెప్పారు.


* 2010లో ఆసియా కప్ జ‌ర‌గ‌గా.. ఆ టోర్నీలో షోయబ్ అక్తర్ కు హర్భజన్ సింగ్ కు మాట‌ల ఫైట్ అయింది. అక్త‌ర్ స్వ‌భావం దుందుడుకుగా ఉండేదీ. అంతేగాకుండా కావాల‌ని గాయాలు త‌గిలేలా బాల్స్ విసిరేవాడు. భ‌జ్జీ బ్యాటింగ్ చేస్తుండ‌గా బౌన్స‌ర్లు వేస్తూ క‌వ్వించాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య వాద‌న జ‌రిగింది.


అంత‌కుముందు 90s లో సైతం భార‌త్, పాక్ ప్లేయ‌ర్ల మ‌ధ్య వాద‌న‌లు చాలానే జ‌రిగాయి. అందులో వెంక‌టేష్ ప్ర‌సాద్ వ‌ర్సెస్ అమీర్ సోహైల్, కిర‌ణ్ మోరే వ‌ర్సెస్ జావేద్ మియాందిద్, 2010లో గంభీర్ వ‌ర్సెస్ క‌మ్రాన్ అక్మ‌ల్, 2012లో ఇషాంత్ శ‌ర్మ‌, వ‌ర్సెస్ క‌మ్రాన్ అక్మ‌ల్ మ‌ధ్య టాక్ వార్ జ‌రిగింది.

ఇండియా ప్లేయింగ్ 11 అంచ‌నా..

ఇక నేడు జ‌ర‌గ‌బోయే మ్యాచ్ ను ఇరు జ‌ట్లు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నాయి. ఇక ఇండియా బంగ్లాను ఓడించి బ‌రిలోకి దిగుతుండ‌గా.. పాక్ సౌతాఫ్రికా చేతిలో కంగుతిని పోటీకొస్తోంది. ఇక ఈ మ్యాచ్ లో తుది జ‌ట్టులో ఎవ‌రుంటార‌నేది ఓ అంచ‌నా..
టాపార్డ‌ర్ – కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, శుభ్ మ‌న్ గిల్, విరాట్ కోహ్లీ
మిడిలార్డ‌ర్ – శ్రేయ‌స్ అయ్యార్, కేఎల్ రాహుల్ (కీప‌ర్),
ఆల్రౌండ‌ర్లు – హార్దిక్ పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్, ర‌వీంద్ర జ‌డేజా
బౌల‌ర్లు – అర్ష‌దీప్ సింగ్, మ‌హ్మ‌ద్ ష‌మీ, కుల్దీప్ సింగ్

Leave a Comment