UAE vs Qatar women’s : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఆసియా క్వాలిఫయర్ టార్నీలో భాగంగా థాయలాండ్లోని బ్యాంకాక్‌లో UAE vs Qatar ఉమెన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సంచలనం చోటు చేసుకుంది. ఎవరు ఊహించని విధంగా యూఏఈ మహిళల జట్టు ఏకంగా తమ జట్టులోని పది మంది బ్యాటర్లను రిటైర్డ్ అవుట్గా ప్రకటించుకొని ఔరా అనిపించింది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.
ఒక్క వికెట్ కూడా పడక..
UAE ఓపెనర్లు కెప్టెన్ ఈషా ఓజా, తీర్థ సతీష్ ఖతార్ బౌలింగ్ ను చితక్కొట్టారు. ఓజా కేవలం 51 బంతుల్లో అద్భుతమైన సెంచరీ (టీ20ల్లో ఆమెకు ఇది నాలుగోది) చేయగా, తీర్థ సతీష్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. వీరిద్దరూ కలిసి వికెట్ పడకుండానే 16 ఓవర్లలో 192 పరుగులు జోడించారు. ఓజా 113 (14 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులతో, సతీష్ 74 (11 ఫోర్లతో) పరుగులతో అద్భుతంగా ఆడుతున్నారు. ఇంకా నాలుగు ఓవర్లు ఉండగా స్కోర్ 250 దాటుతుంది అనుకుంటుండగా ఊహించనిది జరిగింది. యూఏఈ టీం టీంలోని 10 మందిని రిటైర్డ్ అవుట్ గా ప్రకటించుకుంది. దీంతో UAE ఇన్నింగ్స్ 192 పరుగుల వద్ద ముగిసింది. వికెట్ పడకుండానే ఆలౌట్ అవడమే కాకుండా అత్యధిక స్కోరు చేసిన మహిళల టీ20 స్కోర్ గా ఇది రికార్డు సృష్టించింది!
కుప్పకూలిన ఖతార్
/భారీ లక్ష్యాన్ని (193 పరుగులు) ఛేదించేందుకు బరిలోకి దిగిన ఖతార్ మహిళల జట్టు దారుణంగా విఫలమైంది. వారు కేవలం 11.1 ఓవర్లలో 29 పరుగులకే కుప్పకూలారు. వారి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఓపెనర్ రిజ్ఫా బానో ఇమ్మాన్యుయేల్ 20 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. UAE లెఫ్ట్-ఆర్మ్ స్పిన్నర్ మిచెల్ బోథా అద్భుతంగా బౌలింగ్ చేసి 11 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. ఇమ్మాన్యుయేల్ రనౌట్ అయిన తర్వాత, మిగిలిన ఖతార్ బ్యాటింగ్ ఆర్డర్ వేగంగా కుప్పకూలింది. దీంతో UAE మహిళల జట్టు 163 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కేవలం 27.1 ఓవర్లలో మ్యాచ్ ముగిసింది.

రిటైర్ అవుట్ వ్యూహం ఎందుకంటే..
యూఏఈ ఈ ‘రిటైర్ అవుట్’ వ్యూహాన్ని ఎందుకు ఉపయోగించిందంటే.. బ్యాంకాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది. ఒకవేళ వర్షం కారణంగా ఆట ఆగిపోతే.. రెండు జట్లకు పాయింట్లు సమానంగా పంచబడేవి. అలా జరగకుండా ఉండటానికి, యూఏఈ ఈ విచిత్రమైన వ్యూహాన్ని ఉపయోగించి మ్యాచ్‌ను త్వరగా ముగించాలని భావించింది. ఈ వ్యూహం యూఏఈకి అనుకూలంగా పనిచేసింది. సానుకూల ఫలితంతో మ్యాచ్‌ను గెలుపొంది 2 పాయింట్స్ సాధించింది. రిటైర్ అవుట్ అంటే బ్యాటర్ తనంతట తానే అవుట్ గా ప్రకటించుకోవడం. T20, వన్ డే క్రికెట్లో డిక్లేర్ అవకాశం ఉండదు కాబట్టి టీం అంత రిటైర్ అవుట్ ప్రకటించుకోవాల్సి వచ్చింది.