SRH vs RR: జోఫ్రా ఆర్చ‌ర్ కు టార్చ‌ర్.. ఆరెంజ్ ఆర్మీ దండ‌యాత్ర‌కు బ‌లి

SRH vs RR: IPL 2025లో ఆదివారం SRH vs RR మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ స్టార్ పేస‌ర్ అయిన జోఫ్రా ఆర్చ‌ర్ కు స‌న్ రైజ‌ర్స్ బ్యాట‌ర్లు త‌మ షాట్ల‌తో టార్చ‌ర్ చూపించారు. స‌న్ రైజ‌ర్స్ ధాటికి టాప్ మోస్ట్ బౌల‌ర్ అయిన Jofra Archer ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ప‌ర‌మ‌ చెత్త రికార్డు న‌మోదు చేశాడు. త‌న స్పెల్ లో 4ఓవ‌ర్ల‌లో ఏకంగా 76 పరుగులు ఇచ్చాడు. అలాగే ఒకే ఒక డాట్ బాల్ వేయ‌గ‌లిగాడు. ఇక అంత‌కుముందు IPL 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ తరపున మోహిత్ శర్మ 73 పరుగులు ఇచ్చి అప్పుడు చెత్త రికార్డు న‌మోదు చేయ‌గా.. తాజాగా ఆర్చ‌ర్ ఈ రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు.

జోఫ్రా ఆర్చ‌ర్ ను ఎలా ఆడుకున్నారంటే..

ఇక తొలుత పవర్ ప్లేలో 5వ ఓవ‌ర్ బాల్ అందుకున్న జోఫ్రాను ట్రావిస్ హెడ్ (Travis Head) ఓ ఆట ఆడుకున్నాడు. తొలి బంతికే 4 స‌మ‌ర్పించుకున్న జోఫ్రా త‌ర్వాత మ‌రో 3 ఫోర్లు, 1 సిక్స‌ర్ స‌మ‌ర్పించుకుని.. 23 పరుగులిచ్చాడు. తర్వాత 11వ ఓవ‌ర్లో మ‌రోసారి బంతి అందుకున్న జోఫ్రాను ఈసారి నితీష్ రెడ్డి (Nitish Reddy) ఆడుకున్నాడు. రెండు ఫోర్లు బాదాడు. ఇక 13వ ఓవ‌ర్లో మ‌ళ్లీ ఆర్చ‌ర్ రాగా.. ఈసారి ఇషాన్ (Ishan Kishan) జోఫ్రాకు టార్చ‌ర్ చూపించాడు. ఏకంగా మూడు సిక్స‌ర్లు బాదాడు. దీంతో ఆ ఓవ‌ర్లో 22ప‌రుగులొచ్చాయి. ఇక అంత‌టితో ఆగిపోక‌.. కెప్టెన్ రియాన్ ప‌రాగ్ (Riyan Parag) మ‌రోసారి.. 18వ ఓవ‌ర్లో జోఫ్రాకు బంతి ఇచ్చాడు. అప్ప‌టికే ఇషాన్ టార్చ‌ర్ చూపించి ఉండ‌డంతో క్రీజులో ఉన్న అత‌న్ని ఎలాగోలా ఔట్ చేయాల‌ని బంతి విసిరాడు. అది టాస్ బౌన్స్ గా ప‌డి ఫోర్ వెళ్లింది. ఇది జోఫ్రాకు మ‌రింత అస‌హ‌నాన్ని తెచ్చింది. కక్క‌లేక మింగ‌లేక బౌలింగ్ కు దిగాడు.. ఈసారి ఇషాన్ తో పాటు క్లాసెన్ (Heinrich Klaasen) కూడా జ‌త క‌లిశాడు. ఇంకేముంది 4 ఫోర్లు వ‌చ్చాయి. దీంతో ఆ ఓవ‌ర్లో ఏకంగా.. 23ప‌రుగులొచ్చాయి. పాపం రాయ‌ల్స్ టాప్ బౌల‌ర్ అయిన Jofra Archer కు ఈ రోజు ఎంత బ్యాడ్ డేనో.. లేదంటే ఏకంగా 76ప‌రుగులిచ్చి.. ఐపీఎల్లోనే ప‌ర‌మ చెత్త రికార్డు త‌న పేరిట లిఖించుకుంటాడు.

అత్య‌ధిక ప‌రుగులిచ్చిన‌వాళ్ల‌లో..

ఇక‌పోతే ఒక ఐపీఎల్ ఇన్నింగ్స్ లో అత్య‌ధిక ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న బౌల‌ర్లలో లిస్టులో తొలిస్థానంలో జోఫ్రా ఆర్చర్ (రాజ‌స్థాన్ రాయ‌ల్స్) – 76 vs SRH (2025) కాగా త‌ర్వాతి స్థానాల్లో 2. మోహిత్ శర్మ (గుజ‌రాత్ టైటాన్స్) – 73 vs DC (2024), 3. బాసిల్ థంపి (స‌న్ రైజ‌ర్స్) – 70 vs RCB (2018), 4. యష్ దయాళ్ (గుజ‌రాత్ టైట‌న్స్) – 69 vs KKR (2023), 5. రీస్ టోప్లీ (ఆర్సీబీ) – 68 vs SRH (2024). ఉన్నారు.

image credit : X (sunrisers Handle)

ఆరెంజ్ ఆర్మీ దండ‌యాత్ర‌

ఇక‌పోతే ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ అఖండ విజ‌యాన్ని సాధించింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో సెకండ్ హ‌య్య‌స్ట్ స్కోరు చేసి.. భారీ స్కోర్లు సాధించ‌డంతో త‌న‌దైన ముద్ర‌ను కొన‌సాగిస్తోంది. ఒక‌ప్పుడు ఆరెంజ్ ఆర్మీ అంటే బౌలింగ్ జ‌ట్టుగా పేరుండేదీ నేడు ఆరెంజ్ ఆర్మీ అంటే ఏ రేంజులో స్కోరు కొడుతారో అని ప్ర‌త్య‌ర్థి జ‌ట్లు గ‌జ‌గ‌జ వ‌ణికేలా భీక‌ర బ్యాటింగ్ ప్ల‌స్ బౌలింగ్ జ‌ట్టుగా మారింది. ఇక ఈ మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ 40 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత‌ బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 6 వికెట్లకు 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106 నాటౌట్) సెంచ‌రీతో చెల‌రేగ‌గా.. ట్రావిస్ హెడ్ (31 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 67) ఎప్ప‌టిలాగే ప్ర‌త్య‌ర్థికి హెడ్డెక్ తెప్పించాడు. ఇక తెలుగుతేజం నితీష్ కుమార్ రెడ్డి (15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30ప‌రుగులు) ఉన్నంత‌సేపు ఊపునిచ్చేలా ఆడాడు. అరివీర భీక‌రుడు హెన్రీచ్ క్లాసెన్(14 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 34ప‌రుగులు) త‌న మాస్ చూపించాడు. ఆర్ఆర్ బౌలర్లలో తీక్షణ 2, దేశ్‌పాండే 3 వికెట్లు తీసి కాస్త‌లో కాస్త ప‌ర్వ‌లేద‌నిపించిన‌.. మిగితా వాళ్లు స‌మ‌ర్ప‌యామి అనిపించారు. సన్‌రైజర్స్ బ్యాట‌ర్లు ఏకంగా 34 ఫోర్లు, 12 సిక్సర్ల‌తో ఉప్ప‌ల్లో బౌండ‌రీల వ‌ర్షం కురిపించారు.

ఎంట‌ర్టైన్ చేసిన రాయ‌ల్స్

త‌ర్వాత రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 242 పరుగులు చేసింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా బ‌రిలోకి దిగిన‌ సంజూ శాంసన్(37 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 66) ఉన్నంత‌సేపు త‌గ్గేదేలే అన్న‌ట్లు ట్రై చేశాడు. అత‌నికి తోడుగా ధ్రువ్ జురెల్(35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 70) చూసుకుందామ‌న్న‌ట్లు ఆడాడు. కానీ ఏం లాభం.. ఓ వైపు పెరుగుతున్న ర‌న్ రేట్ చూసి కంగారుగా ఔట‌య్యారు. ఇక ఆరిపోయే దాక వెలుగుదామ‌న్న‌ట్లు చివ‌ర్లో షిమ్రాన్ హెట్‌మైర్(15 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 24 నాటౌట్), శుభమ్ దూబే(9 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 32 నాటౌట్) ఎంట‌ర్టైన్ చేశారు. ఈ మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో సిమర్జిత్ సింగ్ 2కీల‌క వికెట్లు తీసి రాయ‌ల్స్ ప‌త‌నానికి నాంది వేయ‌గా.. షమీ, ఇంపాక్ట్ ప్లేయ‌ర్ జంపా, హర్షల్ పటేల్ తలా వికెట్ తీసారు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 17 సిక్సర్లు నమోదయ్యాయి. ఎంతైనా 242 ప‌రుగులు కూడా భారీ స్కోరే క‌దా.

ఇరు జ‌ట్లు

సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ.
ఇంపాక్ట్ ప్లేయ‌ర్ – ఆడం జంపా

రాజస్థాన్ ప్లేయింగ్ XI : యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఫజల్‌హక్ ఫరూఖీ.
ఇంపాక్ట్ ప్లేయ‌ర్ – సంజూ శాంస‌న్

Leave a Comment