Glenn Phillips Fielding: అతగాడి ఫీల్డింగ్ చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. నయా జాంటీ రోడ్స్

Glenn Phillps Fielding: క్రికెట్ చరిత్రలో ఫీల్డింగ్ పరంగా జాంటీ రోడ్స్ ఒక యూనిక్ బ్రాండ్. అతడి వేగం, డైవింగ్ క్యాచ్‌లు, చాకచక్యమైన రనౌట్లు అభిమానులను అబ్బురపరిచేవి. ఇప్పుడు అతని తరహా వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్. న్యూజిలాండ్ జట్టులో ఈ ఆటగాడు అద్భుతమైన ఫీల్డింగ్‌తో అదరగొడుతున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ కళ్లు చెదిరే క్యాచ్‌లు పట్టడం, అద్భుతమైన డైవ్‌లు చేయడం, ఫీల్డింగ్‌లో ఎక్కడైనా కదలడం అతడి ప్రత్యేకత.

అతను ఉన్నవైపు షాట్ ఆడాలంటే వణుకు..

ఫిలిప్స్ మైదానంలో దూకుడుగా ఉండే ఆటగాడు. అతడి వైపు బంతి వెళ్తే తప్పకుండా డైవ్ చేసి గాల్లో పట్టేస్తాడు. ప్రత్యర్థి బ్యాటర్లు అతడి వైపుగా షాట్లు కొట్టడానికి సంకోచిస్తారు. అతడు చేసే రనౌట్లు న్యూజిలాండ్ జట్టుకు కీలక అవకాశాలను అందిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు అందుకున్న క్యాచ్‌ల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. రోడ్స్ తర్వాత అంతటి ప్రభావం చూపిన ఫీల్డర్ అతడేనని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

మల్టీ టాలెంటెడ్ క్రికెటర్

ఫిలిప్స్ కేవలం ఒక ఫీల్డర్ మాత్రమే కాదు, అతడు బ్యాటింగ్, బౌలింగ్‌తోనూ జట్టుకు భారీ తోడ్పాటు అందిస్తున్నాడు. మిడిలార్డర్‌లో అతడు వేగంగా పరుగులు చేయగలడు. అవసరమైనప్పుడు గేర్ మార్చి ఎటువంటి పరిస్థితినైనా తన షాట్లతో ఎదుర్కోగలడు. స్పిన్ బౌలింగ్‌లోనూ చక్కటి ప్రదర్శన కనబరిచే అతడు, కీలకమైన వికెట్లు తీయడంలో నైపుణ్యం ఉన్న ఆటగాడు. అదనంగా వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తించగలడు.

న్యూజిలాండ్‌కు అసలైన ఆయుధం

అన్ని విభాగాల్లో రాణించే గ్లెన్ ఫిలిప్స్, న్యూజిలాండ్ జట్టుకు మల్టీ-యూటిలిటీ ఆటగాడిగా మారాడు. మ్యాచ్‌ మలుపు తిప్పే సామర్థ్యం కలిగిన అతడు, ప్రతీ ఫార్మాట్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. అతని ఫీల్డింగ్‌ కోసం మాత్రమే కాకుండా, ఆల్‌రౌండ్ ప్రతిభ కోసం కూడా టీమ్ మేనేజ్‌మెంట్ అతడిని ప్రత్యేకంగా అభినందిస్తోంది. ఈ మెరుపు ఆటగాడు భవిష్యత్తులో మరింత ప్రభావం చూపడం ఖాయం.

ఫీల్డింగ్‌కు నిర్వచనమే జాంటీ రోడ్స్ 

జాంటీ రోడ్స్ అనే పేరు చెప్తే, క్రికెట్ అభిమానులకు ముందుగా గుర్తుకొచ్చేది అతని అద్భుతమైన ఫీల్డింగ్. దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆటగాడు, 90లలో క్రికెట్ ప్రపంచాన్ని తన మెరుపు ఫీల్డింగ్‌తో మంత్రముగ్ధులను చేశాడు. ఫీల్డింగ్‌ను కళగా మార్చిన ఈ లెజెండరీ ప్లేయర్, తన డైవింగ్ క్యాచ్‌లు, వేగవంతమైన రనౌట్లు, అద్భుతమైన మోషన్‌తో అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. జాంటీ రోడ్స్‌ అంటే ఫీల్డింగ్‌లో అసాధారణ వేగం. ముఖ్యంగా 1992 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ కెప్టెన్ ఇంజమాముల్ హక్‌ను అవుట్ చేసిన రనౌట్ చరిత్రలో నిలిచిపోయింది. బంతిని అందుకున్న వెంటనే చేతిని విసిరి వికెట్ల మీద దూకిన క్షణం క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతం. ఇది క్రికెట్‌లోనే అత్యుత్తమ రనౌట్లలో ఒకటని అంటుంటారు.

అతనుంటే బ్యాట్స్‌మెన్ నాట్ సేఫ్.. 

ఎలాంటి క్యాచ్ అయినా పట్టే నైపుణ్యం కల రోడ్స్ వల్ల ఫీల్డింగ్‌కు క్రికెట్‌లో ప్రత్యేకమైన ప్రాముఖ్యత వచ్చింది. అతని ప్రదర్శన చూసి, జట్లు ప్రత్యేకంగా ఫీల్డింగ్ కోచ్‌లను నియమించుకోవడం ప్రారంభించాయి. ఆధునిక క్రికెట్‌లో ఇప్పటికీ అతని ఫీల్డింగ్ స్టాండర్డ్స్‌ను చేరుకునే ఆటగాళ్లు చాలా తక్కువ. జాంటీ రోడ్స్ సృష్టించిన ఫీల్డింగ్ ప్రమాణాలు ఇప్పటికీ అందరికీ ప్రేరణగా నిలుస్తున్నాయి. అతని స్పీడ్, అద్భుతమైన క్యాచ్‌లు, చాకచక్యమైన రనౌట్లు క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అతనిని మరొకరు పూర్తిగా రీప్లేస్ చేయలేరనడం వాస్తవం. కానీ భవిష్యత్తులో గ్లెన్ ఫిలిప్స్ చేస్తాడేమోననే సందేహం కలుగుతోంది.

Leave a Comment